Coronavirus In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, ప్రజల నిర్లక్ష్యమే కారణమా ?

తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్‌లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Coronavirus In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, ప్రజల నిర్లక్ష్యమే కారణమా ?

Andhra Pradesh, Telangana

Public Negligence : తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. టూ స్టేట్స్‌లోనూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపయింది. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. మరో 2 నెలలపాటు ఈ దూకుడు కొనసాగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు భారీగా వస్తుండటంతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల తాకిడి పెరుగుతోంది.

ఏపీలో ఒక్కరోజే 2,765 కేసులు : –
ఏపీలో ఒక్కరోజే 2 వేల 765 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు 490, కృష్ణా 341, విశాఖపట్నం జిల్లాలో 335 చొప్పున కేసులు రికార్డయ్యాయి. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

తెలంగాణలో : –
ఇటు తెలంగాణలోనూ కేసుల స్పీడ్‌ పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2 వేల 478 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్ధారించిన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తంగా బాధితుల సంఖ్య 3 లక్షల 21 వేల 182కు పెరిగింది. జీహెచ్‌ఎంసీలో గత వారం రోజుల్లో దాదాపు 80 శాతానికి పైగా కేసులు పెరిగాయి. ఈనెల 2న ఇక్కడ 283 కేసులు నమోదయితే.. తాజాగా 402 పాజిటివ్‌లు నిర్ధారణయ్యాయి. మరోవైపు జిల్లాల్లోనూ ఒక్కరోజులోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. జగిత్యాలలో 105, మేడ్చల్‌ మల్కాజిగిరి 208, నిర్మల్‌ 111, నిజామాబాద్‌ 176, రంగారెడ్డి జిల్లాల్లో 162 కేసులొచ్చాయి. మహమ్మారితో మరో 5 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 1 వేయి 746 మంది కరోనాతో మృతిచెందారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటెల సమావేశం : –
కొవిడ్ కేసులు పెరగడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో కొవిడ్ సేవలు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం మధ్యాహ్నం కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలతో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ అధిపతులతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ అవ్వనున్నరు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు వైద్య శాఖ మంత్రి.

Read More : India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు