Uru Vada News : ఊరు వాడ 60 వార్తలు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది.

Uru Vada News : ఊరు వాడ 60 వార్తలు

Uru Vada 60 News 2

Uru Vada .. 60 News : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది. పోలింగ్‌ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలను అధికారులు సిబ్బందికి సూచిస్తున్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హాలియాలోని ప్రభుత్వ సిబ్బందికి ITI కాలేజీలో పోలింగ్‌ సామాగ్రిని అందజేస్తున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోలింగ్‌ సమయాన్ని రెండు గంటలు అదనంగా పెంచారు.. అధికారులు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు వ్యవసాయదారుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోడుదారులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు. పురుగు మందు డబ్బాలతో JCBల ఎదుట ధర్నా చేశారు.

ఇరవై ఏళ్ల నుంచి తాము భూములను సాగు చేసుకుంటున్నామన్నారు. అధికారులు ఇప్పుడొచ్చి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోడుదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా గుండి లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగగా .. తోటి వారు ఆమెను అడ్డుకున్నారు.

పెందుర్తి హత్యల ఘటనలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు
విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో జరిగిన హత్యల ఘటనలో మృతదేహాలకు ఇంకా పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. మృతుల బంధువులు పోస్ట్‌మార్టం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. అప్పలరాజుతో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

యువకుడిని రక్తం కారేలా కొట్టిన మహిళ
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కృష్ణ అనే వ్యక్తిపై స్వప్న అనే మహిళ దాడికి పాల్పడింది. రక్తం వచ్చేలా కొట్టింది. ఫోన్ చేసి తనను లైంగికంగా వేధిస్తున్నాడని..అందుకే దాడి చేశానని… స్వప్న చెబుతుంటే… తన దగ్గర డబ్బులు తీసుకుందని కృష్ణ ఆరోపిస్తున్నాడు.

ఆస్తి కోసం బావమరిదిని హతమార్చిన బావ
ఆస్తి కోసం ఏడేళ్ల వయసుండే బావమరిదిని ఓ బావ హతమార్చాడు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చీగలపల్లె గ్రామంలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన బాలుడును చీగలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కుమారుడు వెంకటాచలపతిగా గుర్తించారు.

మూఢ విశ్వాసంతో కన్నకూతురి ప్రాణం తీసిన తల్లి
మూఢ విశ్వాసంతో ఓ తల్లి తన కన్నకూతురి ప్రాణం తీసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నాగదేవతల చిత్రపటాల వద్ద కూతురు గొంతు కోసింది. యూట్యూబ్‌లో నాగపూజలకు సంబంధించిన వీడియోలు చూసే అలవాటు ఉన్న ఆ మహిళ తన కూతురిని ఆ రీతిలోనే హత్య చేసింది. తన బిడ్డను చంపేసిన తర్వాత తనకు ఏ దోషమూ లేదంటూ కేకలు వేసింది.

ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి
కృష్ణా జిల్లాలో ఓ RMP డాక్టర్ తెలిసీ తెలియని వైద్యంతో ఓ వ్యక్తి ప్రాణం తీశాడు. మచిలీపట్నం చేమనగిరిపేటలో నాగేశ్వరరావు అనే వ్యక్తి మోకాలు నొప్పితో RMP డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. వస్తూ వస్తూ… మెడికల్ షాప్ నుంచి ఓ ఇంజెక్షన్ కూడా తెచ్చుకున్నాడు.. అయితే ఆ ఇంజెక్షన్ ఇవ్వొచ్చా లేదా అని ఆలోచించకుండా… నొప్పి తగ్గేందుకు నాగేశ్వరరావుకు ఇంజెక్షన్ ఇవ్వడంతో .. అది వికటించి అతను చనిపోయాడు.

బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరణ
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డిలో అధికారుల నిర్లక్ష్యం.. అంధురాలికి శాపంగా మారింది. పెన్షన్‌ రావడం లేదని.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బ్రతికుండగానే తమ పేరును పెన్షన్‌ జాబితాలో మరణించినట్లు ధృవీకరించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

లేగదూపై చిరుత దాడి
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో లేగ దూడపై చిరుత దాడి చేసింది. కొమురయ్య అనే రైతు తన లేగ దూడను పొలంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి.. లేగ దూడ మృతి చెందింది. అనుమానంతో ఆ రైతు అటవీ అధికారులకు సమాచారం అందించాడు. చిరుత దాడి చేయడం వల్లే లేగ దూడ చనిపోయిందని.. గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

యాత్రికులపై తేనెటీగలు దాడి
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని యాత్రికులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు ఒక్కసారిగా చెదిరి అటుగా వెళ్తున్న.. యాత్రికులపై దాడి చేయడంతో.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రిలో తరలించారు.

కుక్కలదాడిలో గాయపడ్డ దుప్పి
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గోపాల్‌పూర్‌లో అడవి దుప్పిపై వీధి కుక్కలు దాడిచేశాయి. ఈ దాడిలో ఆ దుప్పికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు.. దుప్పిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయాపడటంతో.. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

జింకపై కుక్కల దాడి
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మర్రిపాలెంలో జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక తీవ్రంగా గాయాపడింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖాధికారులు.. ఆ జింకను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యర్రగొండపాలెంలోని పశు వైద్యశాలలో చికిత్స అందించారు.

మంత్రి ఈటల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి ఈటల కాన్వాయ్‌ను ఏబీవీపీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ.. కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు.. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి డ్రైవర్‌ను విచారిస్తోన్న సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో వివేకానందరెడ్డి కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. ప్రస్తుతం దస్తగిరితో పాటు అతడి భార్య, సీబీఐ అదుపులో ఉన్నారు.

పంచాయతీ కార్యదర్శి ఇళ్లలో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. సుమారు 35 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు.

గవర్నమెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3 లక్షల తీసుకుని పరార్
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సుర్జాపూర్‌లో ఓ నిరుద్యోగిని ఇద్దరు వ్యక్తులు బురిడి కొట్టించారు. రవీందర్‌ అనే వ్యక్తికి గవర్నమెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని మెసం చేశారు.. అతని వద్ద నుంచి 3 లక్షల రూపాయలను తీసుకుని.. అక్కడి నుంచి ఉడయించారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోవడం లేదని.. తనకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నర్సాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా
కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపురంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి కాకుండా.. వేరే వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అర్హులైన వారికి ఇళ్లను కేటాయించాని డిమాండ్‌ చేశారు.

కొంపల్లి జాతీయ రహదారిపై షెట్టర్ల కూల్చివేతపై ఆందోళన
మేడ్చల్ జిల్లా కొంపల్లి జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మించిన షెట్టర్లను నేషనల్ హైవే అధారిటీ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడంపై.. భాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోఏళ్లుగా తాము ఇక్కడే జీవిస్తున్నామని.. కూల్చివేతతో జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ.. రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు.

పూర్తైన బిల్డింగ్‌ కూల్చివేతపై ఆగ్రహం
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో అక్రమ కట్టడాలను పంచాయతీరాజ్‌ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేశారు. నిర్మాణ దశలో ఉన్న కట్టడాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. అయితే మొదటిదశలో నోటీసులు ఇవ్వకుండా.. బిల్డింగ్‌ పూర్తి. చేసి, రంగులు వేసే సమయంలో కూల్చివేతపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రిల్లింగ్‌లో ఎగిసిపడ్డ మంటలు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలో ONGC చేపట్టిన డ్రిల్లింగ్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సామర్థ్యాన్ని గుర్తించేందుకు టెస్టింగ్‌ నిర్వహించామన్నారు. ఆసమయంలోనే మంటలు వచ్చాయని చెప్పారు. మరోవైపు ఎగిసిపడిన మంటలను చూసి.. అక్కడి గ్రామస్తులు భయాందోళన చెందారు.

రెచ్చిపోయిన ఇసుక మాఫియా
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. మిడ్జిల్ మండలం వాడ్యాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిపై విచక్షారహితంగా దాడి చేశారు. దుందుభి నది నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా.. మధు అనే వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో ఆ యువకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు.

కాళేశ్వరం నీటితో రైతులకు కష్టాలు!
కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో కాళేశ్వరం నీళ్లను అవసరానికంటే ఎక్కువగా విడుదల చేయడంతో.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మానేరు డ్యామ్ పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరిపంట వేశారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటిని వదలడంతో.. సుమారు ఐదు వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రభుత్వం వెంటనే నీటి విడుదలను నిలిపివేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడప జిల్లాలో డయాగ్నోస్టిక్‌ కేంద్రం ప్రారంభం
కడప జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభిచారు జిల్లా SP ఎస్పీ అన్బురాజన్. అతి తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంలో డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు, పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

ఆయిల్‌ మాఫియాను అడ్డుకున్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా వాసాలతిప్పలో ఆయిల్‌ మాఫియాను పోలీసులు అడ్డుకున్నారు. ONGC చమురు బావి నుంచి..అక్రమంగా పైపులతో చమురు దోచుకుపోతున్నారని.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన.. 4 వందల మద్యం బాటిళ్లు స్వాధీనం
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేటలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన.. 4 వందల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం దుకాణంలోని సేల్స్ మెన్స్, సూపర్ వైజర్ కుమ్మకై ఈ ఘటనకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

అక్రమ రేషన్‌ బియ్యం స్వాధీనం
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేస్తుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాటిని రీసైక్లింగ్ చేసేందుకు .. రైసు మిల్లుకి తరలించడానికి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి.. సుమారు 160 క్వింటాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు
కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం బుగ్గానిపల్లిలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడులో 6వేల లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. అక్రమంగా సాటునారా తయారు చేస్తున్న 11 స్థావరాలను గుర్తించిన పోలీసులు .. వాటి దగ్గర నుంచి 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

గుత్తిలో రెచ్చిపోయిన దొంగలు
అనంతపురం జిల్లా గుత్తిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. బీసీ కాలనీలో రెండిళ్లలో దొంగలు చొరబడి.. 10 తులాల బంగారం.. 85 వేల నగదును దోచుకుపోయారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడివుండంతో.. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించారు.

రోడ్డెక్కిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు
జిల్లా కొత్తగూడెంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోడ్డెక్కారు. ప్రాణాలకు తెగించి కోవిడ్‌ వైద్యసేవలు అందిస్తుంటే తమపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో ప్రభుత్వాస్పత్రిలో.. వ్యక్తి మృతి చెందడంతో డాక్టర్లపై రోగి బంధువుల దాడి చేశారు. ఈ దాడిలో ఆస్పత్రిలో ఫర్నీచర్‌, అద్దాలు ద్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యులు.. ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్‌
కరోనా నుంచి రక్షణ పొందడం కోసం మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి. కానీ చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్‌లో ఓ సచ్ఛంద సంస్థ బస్టాండ్‌ దగ్గ మాస్క్‌ వాల్‌ ఏర్పాటు చేసింది. మాస్క్‌ పెట్టుకోపోతే కలిగే కష్టనష్టాలను వివరిస్తూ.. ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేస్తోంది.

వ్యాక్సిన్‌ కోసం బారులు తీరుతున్న జనం
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల ప్రజలు.. సర్కారు మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన వాళ్లంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి బారులు తీరుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో ట్రాక్టర్లలో తరలి రావడంతో .. ఆస్పత్రి దగ్గ రజాతర వాతావరణం కనిపిస్తోంది.

గంగారం మండలంలో కోవిడ్ కేసులు అత్యల్పమే. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్‌లు ఇంటింటికీ వెళ్ళి ప్రజల్లో చైతన్యం కల్గించారు. దీంతో జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కానీ చదువు రానీ వారిలో ఉన్న చైతన్యాన్ని చూసైనా టీకా వేయించుకోవాలనే సందేశం ఇస్తున్నారు.

వ్యాపారస్తుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌
కరోనా భయంతో విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే షాపులను తెరిచి ఉంచాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో కరోనా కేసులు అధిక సంఖ్యలో పెరగడంతో అక్కడి వ్యాపారస్తులు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కొడిమ్యాలలో లాక్‌డౌన్‌
కరీంనగర్‌ జిల్లా కొడిమ్యాలలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడి పాలకవర్గం.. లాక్‌డౌన్‌ విధించింది. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే.. జరిమానా విధిస్తున్నామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌కు గ్రామస్తులు సహకరించాలని కోరారు.

నకిలీ మాస్కులు స్వాధీనం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ నకిలీ మాస్కులు అమ్ముతున్న బలరాం అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాం రాజ్ కాటన్ పేరిట నకిలీ మాస్కులను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి 5లక్షల రూపాయల విలువ చేసే.. మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

టీకా కోసం వందల సంఖ్యలో ముందుకొచ్చిన జనాలు
జనగామ జిల్లా పాలకుర్తిలో అర్హులైన వారు.. టీకా తీసుకునేందుకు హెల్త్‌ సెంటర్ల వద్ద బారులు తీరారు. నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో.. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో 45ఏళ్లు దాటిన వారందరూ టీకా తీసుకునేందుకు వందల సంఖ్యలో ముందుకు వచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ.. టీకా వేయించుకుంటున్నారు.

కరోనా రావడంతో యువకుడు ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా నడిపల్లిలో విషాదం నెలకొంది. కరోనా పాజిటివ్‌ రావడంతో.. పురుగుల మందు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్ననే గుంటూరు నుంచి వచ్చిన షేక్‌ విలాయత్‌కు.. కరోనా పాజిటివ్‌ వచ్చిదని ఫోన్‌ వచ్చింది. దీంతో.. ఉదయం నుంచి కనిపించకుండా పోయిన విలాయత్‌.. శవమై కనిపించాడు.

కరోనా కారణంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత
కరోనా కారణంగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేందర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసేస్తుట్లు అధికారులు తెలిపార. శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తున్నాయి.

పాలంపేటలో రామప్ప ఆలయాన్ని కూడా మూసివేత
ఇటు ములుగు జిల్లా పాలంపేటలో రామప్ప ఆలయాన్ని కూడా మూసివేశారు. కరోనా వ్యాప్తి విస్తృతంగా వ్యాపించడటంతో పురావస్తు శాఖా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని.. భక్తులు ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

లేపాక్షీ వీరభద్ర ఆలయంపై కరోనా ఎఫెక్ట్
అనంతపురం జిల్లా హిందూపురం మండలం లేపాక్షిలోని వీరభద్ర ఆలయంపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. కోవిడ్‌ కారణంగా.. వచ్చే నెల 15వ తేదీ వరకు ఆలయ ముఖ ద్వారాలు మూసివేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయంలో దుర్గ రఘునాథ పాపనాశేశ్వర స్వామివారికి మాత్రం ఉదయం పూట పూజలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. భక్తులకు మాత్రం అలయంలోకి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు.

తప్పిన ప్రమాదం
మెదక్‌ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్‌లో ఉన్న హల్దీవాగు దగ్గర ప్రమాదం తప్పింది. ఓ యువకుడు బైక్‌తో వాగును దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో వరద ఉదృతికి బైక్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు‌ అతడిని కాపాడి సురక్షింతంగా బయటకు తీసుకువచ్చారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు మానవత్వం
ఖమ్మం జిల్లాలో ఎంపీ నామా నాగేశ్వరరావు తన మానవత్వం చాటుకున్నారు. కొణిజర్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్యా, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పుడే అటుగా వెళ్తున్న ఎంపీ.. తన సొంత వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రెండు లారీలు ఢీ..ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు వాహనాలు.. బైక్‌ను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరి మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిన్నబండ తాండాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న DCM.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా…మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాపడిన వారిని..ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు యాలాల్ మండలానికి చెందిన వారికి పోలీసులు గుర్తించారు.

కుప్పంలో యువకుడు దారుణ హత్య
కుప్పం పరిసరాల్లో మరో దారుణం జరిగింది. ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు… అత్యంత కిరాతకంగా శరీరాన్ని రెండు ముక్కలు చేసి ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేశారు. మృతుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు దొరికన శరీర భాగాల్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని చంచేసిన దుండగులు
అనంతపురం జిల్లా ఐరన్ బ్రిడ్జి దగ్గర దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న షేక్షావలి అనే వ్యక్తిని..గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు.

విద్యుత్‌ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబగడలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న లైన్‌మెన్‌ కిరణ్‌ అనే వ్యక్తి.. కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా.. తను మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.

వికారాబాద్ అడవిలో యువకుడి మృతదేహం
వికారాబాద్ జిల్లా అడవిలో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం లభించింది. గ్రామస్తుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటన ప్రదేశంలో దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా మృతుడు పేరు సురేశ్‌ అని.. మర్పల్లి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంపై కరోనా ఎఫెక్ట్‌
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణోత్సవాన్ని టాన్స్‌జెండర్లు చూసి తరించడం ఆనవాయితీ. అయితే కరోనా వల్ల గతేడాది కల్యాణాన్ని చూడలేకపోయిన హిజ్రాలకు ఈసారి కూడా నిరాశే ఎదురవుతోంది. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా థర్డ్ జెండర్స్ రాలేకపోయారు. ఈసారి కూడా హిజ్రాలకు నో ఎంట్రీ అని అధికారులు ప్రకటించేశారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లో అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు..ఎమ్మెల్యే దాసరి మనోహర్. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 88 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్‌..మహిళలకు అండగా ఉంటు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షా నూట పదహారు రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారని చెప్పారు.

సారంగాపుర్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
జగిత్యాల జిల్లా సారంగాపుర్‌లో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌. అర్హులైన 40 మంది లబ్దిదారులకు 40లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పలువురికి చెక్కులను అందజేశారు.

ఖానాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించారు ఎమ్మెల్యే రాములు నాయక్.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.

అశ్వారావుపేటలో షర్మిల మద్దతుదారుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులకు వ్యతిరేకంగా షర్మిల మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ధీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మద్దతుదారులు నల్లబ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు.

రామచంద్రాపురంలో పోలవరం ప్రత్యేక అధికారి సమీక్ష
పశ్చిమగోదావరి జిల్లా కోట రామచంద్రాపురంలోని ITDA కార్యాలయంలో అధికారులతో పోలవరం ప్రత్యేక అధికారి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్వాసితుల తరలింపు.. పునరావాస గృహాల నిర్మాణంపై చర్చించారు. నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు నేతలు
సిద్దిపేట జిల్లాలో పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన గుండు భూపేశ్.. తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి హారీష్ రావు సమక్షంలో కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. గుండు భూపేశ్‌ పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. దీంతో సిద్దపేట జిల్లాలో టీడీపీ పూర్తిగా కురుమరుగై పోయిందని చెప్పారు మంత్రి హారీశ్‌ రావు.

అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన
ప్రకాశం జిల్లా కంభంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను పంపిణీ చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌ల్లోకి వెళ్లి ప్రయాణికులకు..అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

లేగదూడకి నామకరణోత్సవం
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో లేగ దూడకి నామకరణోత్సవం చేశారు. గ్రామస్తుల సమక్షంలో వేదపండితులు నామకరణ చేసి.. బారసాల నిర్వహించారు. లేగాదూడకు నూతన వస్త్రాన్ని కప్పి.. ఉయాలలో ఉంచి జోల పాటలు పాడారు. గోమాతను పూజించడం ఎంతో సంతోషంగా ఉందని వేదపండితులు చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరు ZP హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ఏర్పాట్లను సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు. గూడూరులో మొత్తం 360 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 3 వేల మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేసేలా అధికారులకు సూచించారు.

పెరుతున్న కరోనా కేసులు… కృష్ణా జిల్లా వైద్యారోగ్య శాఖ అలెర్ట్
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుతున్న తరుణంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అలెర్టైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అదనపు బెడ్స్‌ సిద్ధం చేస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుహాసిని చెప్పారు. మొత్తం 14 ఆస్పత్రుల్లో 12 వందల బెడ్స్‌ను రెడీ చేశామన్నారు. కోవిడ్‌ పేషెంట్‌ ఆస్పత్రికి వచ్చిన మూడు గంటల్లోనే బెడ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.