Mylavaram: మళ్లీ హీటెక్కిన మైలవరం రాజకీయం.. వైసీపీకి తప్పని తలనొప్పులు

కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.

Mylavaram: మళ్లీ హీటెక్కిన మైలవరం రాజకీయం.. వైసీపీకి తప్పని తలనొప్పులు

Mylavaram Politics

Mylavaram Politics: ఏపీలో అధికార వైసీపీకి తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఒక నియోజకవర్గం తర్వాత మరో నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కోనసీమలో మంత్రి వేణు, ఎంపీ బోస్ పంచాయితీ చల్లబడిందంటే.. ప్రకాశంలో రోడ్డెక్కారు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి.. ఈ ఇద్దరి కొట్లాటపై ట్రబుల్‌షూటర్ విజయసాయిరెడ్డి కల్పించుకుని సర్దుబాటు చేస్తున్నారన్న సమయంలో మైలవరంలో ప్రచ్ఛన్నయుద్ధం హాట్‌టాపిక్ అవుతోంది.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విదేశీ పర్యటనతో కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న మైలవరం రాజకీయం మళ్లీ మళ్లీ హీటెక్కుతోంది.

కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి జోగి రమేశ్, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకప్పుడు మైలవరం ఇన్‌చార్జిగా పనిచేసిన జోగి రమేశ్.. ఎన్నికల ముందు వసంత కృష్ణప్రసాద్ కోసం పక్కనే ఉన్న పెడన నియోజకవర్గానికి మారిపోయారు. ఐతే నియోజకవర్గంలో ఉన్న తన అనుచరుల కోసం తరచూ మైలవరం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు వసంత.

Also Read: నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పరస్పర విమర్శలు, సవాళ్లతో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్‌లో పోరాడారు. ఐతే అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా సర్దుమణిగినట్లు కనిపించినా.. ఇద్దరి మధ్య అంతరం మాత్రం యథావిధిగా కొనసాగింది. ఈ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విదేశీయానానికి వెళ్లడంతో నియోజకవర్గంలో రకరకాల ప్రచారం జరిగింది. మంత్రి జోగి రమేశ్‌తో విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే పార్టీ మారతారనే ప్రచారం ఒకానొక సమయంలో జరిగినా.. ఎమ్మెల్యే మాత్రం వైసీపీ అధిష్టానం పట్ల విధేయత ప్రకటిస్తూ.. ఆ ప్రచారాన్ని కొట్టిపడేసేవారు.

Also Read: నీకు దమ్ముంటే, నువ్వు ఎన్టీఆర్ మనవడే అయితే అక్కడి నుంచి పోటీ చేయ్

ఈ సమయంలోనే ఎమ్మెల్యే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా.. విదేశీయాత్రలకు వెళ్లారు. దాదాపు రెండు మూడు నెలలు ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడం.. ఎన్నికల సమయంలో విదేశాలకు వెళ్లడంతో ఆయన మళ్లీ మైలవరంలో పోటీ చేయరని.. రాజకీయాలకే దూరమైతారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ప్రత్యర్థులు కూడా ఒకటికి పదిసార్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ విదేశీయాత్రపై ఆరా తీస్తూ సంబరాలు చేసుకున్నారు. ఐతే వారి ఆనందాన్ని పటాపంచలు చేస్తూ ఈ మధ్య సడన్‌గా మళ్లీ మైలవరంలో ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యే. అంతేకాకుండా నియోజకవర్గ వ్యవహారాల్లో చురుగ్గా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. దీంతో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ తప్పుకున్నారని సంబరపడిన ప్రత్యర్థులు డైలమాలో పడిపోయారు.