పాయసంలో నిద్రమాత్రలు కలిపి…. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

పాయసంలో నిద్రమాత్రలు కలిపి…. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

తాగుబోతు భర్త పెట్టే కష్టాలతో ఒక వివాహిత మహిళ వేరొకరితో బంధం ఏర్పరుచుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రికరించాలని చూసింది. కానీ పోలీసుల విచారణలో ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి చేసిన నేరం ఒప్పుకుంది.

కర్నూలు నగరంలోని గిప్సన్ కాలనీకి చెందిన రామానాయుడుకు 17 ఏళ్ల క్రితం నిర్మల అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాలక్రమంలో రామానాయుడు మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. భర్త తాగుడు మానక పోవటంతో కుటుంబ పోషణ భారమయ్యింది.

కుటుంబాన్ని పోషించటానికి నిర్మల రెండేళ్ల క్రితం స్ధానిక SLNKV ఫుడ్ ఫ్యాక్టరీలో స్వీపర్ గా చేరింది. అక్కడ కిషోర్ బాబు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. క్రమేపి ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కొన్నాళ్లకు రామానాయుడుకు తెలిసింది. ఒక రోజు ఈ విషయమై రామానాయుడు భార్యను నిలదీశాడు. అప్పటినుంచి రోజూ భార్యను మాటలతో వేధించి గొడవపడేవాడు.

భర్త వేధింపులు భరించలేని నిర్మల భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు కిషోర్ బాబుకు చెప్పింది.  రామానాయుడును హత్య చేసేందుకు తన అల్లుడు ధర్మపేటకు చెందిన విజయ్, అతని స్నేహితుడు రాకేష్ ను కిషోర్ సంప్రదించాడు. అందరూ కలిసి  రామానాయుడు హత్యకు పధకం రచించారు.

మార్చి 22, జనతా కర్ఫ్యూ  నిర్వహించిన రోజున రామానాయుడుకు నిర్మల పాయసం ఇచ్చింది. అందులో నిద్ర మాత్రలు కలిపింది. పాయసం తిన్న రామానాయుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో విజయ్, రాకేష్ లతో కిషోర్..నిర్మల ఇంటికి చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామానాయుడు  గొంతుపై కాలుపెట్టి  ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆటోలో నంద్యాల రోడ్డులో ఉన్న దిన్నెదేవర పాడు వంతెన రోడ్డు వద్దకు తీసుకువెళ్లి పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆటోను ఎక్కించారు.

మర్నాడు ఉదయం తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ తబ్రేజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు పోలీసులు.

ఇన్వెస్టిగేషన్ లో నిర్మల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించేసరికి నిజం ఒప్పుకుంది. రామానాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.  రామానాయుడు భార్య నిర్మల, ఆమెకు సహకరించిన కిషోర్, విజయ్, రాకేష్, లను పోలీసుల అరెస్టు చేశారు.