అధికారం ఎక్కడుంటే అక్కడుండే పొలిటికల్ బిజినెస్‌ మ్యాన్‌.. వైసీపీలోకి వెళ్తారా, బీజేపీలో చేరతారా

  • Published By: naveen ,Published On : November 2, 2020 / 04:38 PM IST
అధికారం ఎక్కడుంటే అక్కడుండే పొలిటికల్ బిజినెస్‌ మ్యాన్‌.. వైసీపీలోకి వెళ్తారా, బీజేపీలో చేరతారా

ganta srinivas rao: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేకమైన స్టైల్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించే గంటా.. మారిన ప్రతిపార్టీలోనూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే ఈ పోలిటికల్ బిజినెస్‌ మ్యాన్‌కు 2019 నుంచి అంతగా కలసిరావడం లేదంటున్నారు. నియోజకవర్గాలు మారి వరుసగా గెలుస్తున్నా ఈసారి మాత్రం అధికారంలో లేకపోవడం పెద్ద లోటని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

వైసీపీలోకి గంటాతో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు:
తెలుగుదేశం పార్టీకి గంటా రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరతారని, ఆయనతో పాటు టీడీపీ నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఒకానొక దశలో మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ విషయంపై బాహాటంగా తన అసంతృప్తి కూడా వెళ్లగక్కారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా గంటా రాకను వ్యతిరేకించారనే ప్రచారం జోరుగా సాగింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుల దగ్గర గంటా మంత్రాంగం:
ఆగస్ట్‌ నెలలోనే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుల దగ్గర మంత్రాంగం నడిపారనీ, ఆయన గంటా శ్రీనివాసరావు రాకను స్వాగతించారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో గంటాకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కూడా వైసీపీలో జాయిన్ అవ్వడంతో ఈ వాదనలకు బలం చేకూరింది. విజయసాయి రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో పార్టీ విధానాలు నచ్చిన వారు ఎవరైనా పార్టీతో కలసి పని చేయడానికి సిద్ధపడితే, ఆహ్వానిస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికగా వైసీపీలోకి:
గంటా శ్రీనివాసరావు టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తారని, ఏదో ఒక ప్రాంతీయ బోర్డు చైర్మన్‌గా ఆయనను నియమిస్తుందని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలతోనే అగస్ట్, సెప్టెంబర్ అయిపోయాయి. కానీ అసలు గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత మాత్రం రావడం లేదంటున్నారు. ఇదే సమయంలో మరోసారి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. గంటా తన మార్కును చూపిస్తూ జనవరిలో జరిగే ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వైసీపీలో చేరతారనే టాక్‌ మొదలైంది.

బీజేపీ వైపు గంటా చూపు:
జగన్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, విశాఖ జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆయనతో పాటు వైసీపీ కండువా కప్పుకొంటారనే ప్రచారం సాగుతోంది. ఇంకో వైపు గంటా చూపు బీజేపీపై కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం సోమువీర్రాజు నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోయే పని లేదని గంటా వ్యవహార శైలి తెలిసిన వారు అంటున్నారు. గంటాతో సన్నిహితంగా మెలిగే వారు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు రాకుండా, వైసీపీలో చేరకుండా ఉంటేనే బెటర్ అనే అలోచనకు గంటా వచ్చారని చెబుతున్నారు. అందుకే అటు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్‌గా ఉంటున్నారని అంటున్నారు. దీంతో అధికారంలో ఉన్న పార్టీలోకి గంటా మారతారనే అపవాదుకు బ్రేకులు వేసినట్టు అవుతుందని భావిస్తున్నారు.