విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరమైతే సమస్యలు తీరిపోతాయా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరమైతే సమస్యలు తీరిపోతాయా?

Visakhapatnam steel plant privatization : విశాఖపట్నం.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది ఉక్కు ఫ్యాక్టరీ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాలు, 32మంది ప్రాణత్యాగం కళ్లముందు మెదులుతాయి. కానీ.. అవన్నీ జ్ఞపకాలుగానే మిగిలిపోతాయా… ! ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన మొదలయ్యింది. స్టీల్ ఫ్యాక్టరీని వంద శాతం ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం చెబుతున్న మాటను విశాఖవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.

1966 నవంబర్ ఒకటి.. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు ప్రాణాలు కొల్పోయారు. ఆరోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల కాల్పుల్లో మొత్తం32మంది చనిపోయారు. అర్ధ శతాబ్ధం క్రితం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిందా ఘటన. 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం ఉధ్రుతంగా సాగింది. విద్యార్థులు ఉద్యమం ముందు వరుసలోకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. బంద్‌లు, హర్తాళ్లు,సభలు, సమ్మెలు,నిరాహార దీక్షలతో రాష్ట్రం హోరెత్తిపోయింది. రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది.

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకు నిరసనలు వెళ్లాయి. దీంతో.. కేంద్రంలో కదలిక వచ్చింది. ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత.. 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో వేయి కోట్లు మంజూరు చేయటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.

1971 జనవరి 20న ప్లాంట్ నిర్మాణానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. . ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. చివరకు 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. సాగరతీరాన పురుడు పోసుకున్న తొలి ఉక్కుకర్మాగారంగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం 17 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 16వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు.

పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా అలరారుతోంది. ఈ నవరత్న సంస్థలో.. ప్రస్తుతం కేంద్రానికే వంద శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ 26వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. ఫ్యాక్టరీ నిర్మించిన తొలి సంవత్సరాల్లో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతికాలంలో ఆ ఇబ్బందులను అధిగమిస్తూ.. ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి చెందింది.

2002వ సంవత్సరం నుంచి 2015వరకు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. 2003 నుంచి 2009 వరకు ఏటా వెయ్యికోట్లకు పైగా లాభాలు నమోదు చేసింది. 2015తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఫ్యాక్టరీని నష్టాలు వెంటాడాయి. తర్వాతి ఏడాది 2018-19లో మాత్రం 97కోట్ల లాభం సాధించింది. ఐతే గత ఆర్ధిక సంవత్సరంలో 3వేల కోట్లకు పైగా నష్టం నమోదు చేసింది. అయితే.. 2030 నాటికి 20 మిలియన్‌ టన్నులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతోంది.

దేశంలో సాగరతీరంలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనే.. 2010లో నవరత్న హోదాను పొందిందీ పరిశ్రమ. కాలక్రమేణా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నా… కొంతకాలంగా డిమాండ్‌ తగ్గడంతో విశాఖ స్టీల్స్‌ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం పెనుభారంగా మారింది.
వీటన్నింటికి తోడు.. ఒక్క టన్ను ఇనుము ఉత్పత్తి చేసేందుకు సుమారుగా 5వేల రూపాయల నష్టం కలుగుతోంది. ఈ లెక్కన ఏటా భారీగా నష్టాలు వస్తున్నాయని కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి.

కొన్నేళ్లుగా బహిరంగమార్కెట్‌లో ఐరన్ ఓర్, బొగ్గు ధరలు పెరగడంతో 4వేల కోట్ల భారాన్ని స్టీల్ ఫ్యాక్టరీ మోయాల్సి వచ్చింది. ఆధునికీరణ, విస్తరణ చేపట్టడంతో పెద్దఎత్తున ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంది. 2018తో పోలిస్తే 2019 జూన్‌నాటికి ఉక్కు ఉత్పత్తి ఖర్చులు దాదాపు 7శాతం పెరిగాయి. దీంతో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా బోర్డు అనుమతి కూడా తీసుకున్నారు అధికారులు. ఇలాంటి పరిణామాల మధ్య ఆర్ఐఎన్ఎల్‌లో వాటా విక్రయించి.. పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.