వైసీపీ టార్గెట్ విశాఖ : క్యూ కడుతున్న నేతలు

  • Published By: madhu ,Published On : March 9, 2020 / 12:42 AM IST
వైసీపీ టార్గెట్ విశాఖ : క్యూ కడుతున్న నేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. మరీ ముఖ్యంగా వైజాగ్‌ను టార్గెట్‌ చేసింది. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా వైజాగ్‌కు క్యూ కడుతున్నారు వైసీపీ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం విశాఖలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వైజాగ్‌ మేయర్‌ పీఠం గెలిచి… మూడు రాజధానుల నిర్ణయం సరైందేనని నిరూపించాలని సర్కార్‌ దూకుడు మీదుంది. 

పక్కా ప్లానింగ్‌తో ప్రచారం : –
అధికారపక్షం స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంది. తొమ్మిది నెలల పాలనకు  ఈ ఎన్నికలు రిఫరెండంగా భావిస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్, ఉత్తరాంధ్ర అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు చెప్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం సూచించడంతో నేతలు ఇన్‌చార్జీలుగా మారిపోయి పర్యటనలతో దూకుడు చూపిస్తున్నారు. గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యేలు, మంత్రులపైనే పెట్టడంతో… అభ్యర్థుల ఎంపికలోనూ నేతలు ఆచీతూచీ వ్యవహరిస్తూ పక్కా ప్లానింగ్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు.  

నేతల విమర్శలు :-
వైజాగ్‌ భవిష్యత్‌లో ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి చాలా జాగ్రత్త పడాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు పోకుండా ఎన్నికలు నిర్వహించడం సాహసోపేత నిర్ణయమన్నారాయన. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు… రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు. ఐదేళ్లు పాలించి విశాఖపట్నానికి మేయర్ ఎలక్షన్స్ పెట్టలేకపోయాడన్నారు. ఓ బీసీ వ్యక్తికి వైజాగ్ మేయర్‌ పీఠం ఇవ్వబోతున్నామన్నారు అవంతి.

మేయర్ పీఠంపై కన్ను : –
చంద్రబాబు పోతూపోతూ రాష్ట్రానికి అప్పులు మిగిల్చి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కన్నబాబు. 65వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రెండున్నర లక్షల అప్పులు ఇచ్చి చంద్రబాబు వెళ్లిపోయాడని ఫైర్ అయ్యారు. అప్పులున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ జగన్‌ వెళ్తున్నారన్నారన్నారు. ఓ యువనేతగా దేశం తనవైపు చూసేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మొత్తంగా… అలా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో లేదో నేతలంతా వైజాగ్‌లో వాలిపోయారు. మేయర్‌ పీఠం గెలిచి మూడు రాజధానుల నిర్ణయం సరైందని నిరూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 
Read More : – ఏపీలో స్థానిక సంగ్రామం : నామినేషన్ల ప్రక్రియ షురూ