YSR Vahana Mitra : లబ్ధిదారులకు రూ. 248.47 కోట్ల ఆర్థిక సాయం

YSR Vahana Mitra : లబ్ధిదారులకు రూ.  248.47 కోట్ల ఆర్థిక సాయం

Ysr Vahana Mitra Third Phase Money Release

YSR Vahana Mitra : మంగళవారం వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో దశలో భాగంగా లబ్దిదారులకు నగదు జమ చేశారు. రాష్ట్రంలోని 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్లు తమ కష్టాలను తన దృష్టికి తీసుకొచ్చారని, తాము కష్టపడి ఆటో నడుపుతున్నామని, కానీ వచ్చిన డబ్బులు ఆటో రిపేర్లు, రోడ్డు టాక్సీలు, పోలీసులు విధించే ఫైన్లకే సరిపోవడం లేదని తన ముందు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

వారి ఆవేదనను అర్ధం చేసుకొని మే 14, 2018న ఏలూరు సభలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మాట ఇచ్చానని మాట ప్రకారం వైసీపీ అధికారంలోకి రాగానే ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్ధిక సాయం ప్రకటించామని తెలిపారు. ఇప్పటివరకు ప్రతి ఆటో, టాక్సీ డ్రైవర్లకు 30 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. గతంలోలా వారికి పన్నులు విధించడం లేదని వివరించారు.

ప్రభుత్వం చేసిన ఆర్ధిక సహాయంతో ఆటోలను రిపేర్ చేయించుకొని ఫిట్ నెస్ పెంచుకున్నారని, ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గాయని సీఎం తెలిపారు. ఇక గతేడాదికి ఈ ఏడాదికి లబ్ధిదారులు 42,932 మంది పెరిగారని తెలిపారు. సహాయం పొందుతున్న వారిలో 84 శాతం మంది ఎస్సీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని జగన్ వివరించారు.

ఈ పథకం ద్వారా రూ.248.47 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఇక ఈ పథకంపై ఎటువంటి సందేహాలు ఉన్నా 9154294326 నంబర్‌ కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు సీఎం జగన్.