పంట వ్యర్థాల దహన నివారణకై కమిటీ…సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2020 / 04:14 PM IST
పంట వ్యర్థాల దహన నివారణకై కమిటీ…సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Big Move On Stubble Burning పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట పంట వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా ఢిల్లీ,దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-16,2020)సుప్రీంకోర్టు…హర్యానా,పంజాబ్,యూపీలో పంట పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.



ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగాలని కమిటీని నియమిస్తూ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. పంట వ్యర్థాలు దహనం జరిగే పొలాల్లో ప్రత్యక్ష తనిఖీ సమయంలో ఈ కమిటీకి కావాల్సిన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ(EPCA)కి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు కమిటీకి సహాయపడేందుకు ఎన్‌సీసీ(National Cadet Corps), ఎన్‌ఎస్ఎస్(National Service Scheme), భారత్ స్కౌట్స్ బృందాల వినియోగం కూడా సరైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.



15 రోజులకోసారి కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలని సూచించింది. కాగా, కమిటీ ఏర్పాటుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తరపున కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది.