గ్రేటర్‌ ఎన్నికలు : గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 08:47 AM IST
గ్రేటర్‌ ఎన్నికలు : గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన  చర్యలు

GHMC elections posters and wall writing Prohibition : గ్రేటర్‌ ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం ఇక కుదరదు. ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కడితే చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల కోసం 30వేల మందితో పోలీసులు బందోబస్తుకు రెడీ అయిపోయారు.



జీహెచ్‌ఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈరోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత నిర్వహించే ప్రచారం కోసం పార్టీలన్నీ ప్రచారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహించాలి, ఎవరెవరు ప్రచారంలో పాల్గొనాలి, ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశాలపై పార్టీల నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఈ సమయంలోనే… జీహెచ్‌ఎంసీలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను బల్దియా విడుదల చేసింది. గోడలమీద రాతలు, పోస్టర్లు, పేపర్లు అంటించడం, లేక మరే ఇతర విధంగా ప్రభుత్వ ఆవరణలను పాడు చేయడాన్ని నిషేధించింది.



పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథీన్​తో తయారైన పోస్టర్లు, బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచించారు. ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై సంబంధిత ప్రింటర్, పబ్లిషరు పేర్లు, అడ్రస్సులు లేకుండా ముద్రించరాదని స్పష్టం చేశారు. ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలన్నారు. ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి.. ఎలాంటి ప్రచార సాధనాల్లోనూ ప్రచారం నిర్వహించరాదని తేల్చి చెప్పింది.



https://10tv.in/allocation-of-tickets-to-the-greater-congress-which-has-become-controversial/
లౌడ్‌ స్పీకర్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది. బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనల్లో లౌడ్‌ స్పీకర్స్‌ను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య, ఇతర సందర్భాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. పబ్లిక్‌ మీటింగ్స్‌ను రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటలకన్నా ముందు ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరాదని స్పష్టం



బల్దియా ఎన్నికలకు అటు పోలీస్‌శాఖ కూడా సన్నద్ధం అయ్యింది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఖాకీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 30వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్స్‌ను బైండోవర్‌ చేస్తున్నారు.



గ్రేటర్‌ పరిధిలోని లైసెన్స్‌డ్‌ ఆయుధాలను వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్లలో సరెండర్‌ చేయాలని ఎన్నికల సంఘం అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో పోలీసులు లైసెన్స్‌డ్‌ ఆయుధాల సరెండర్‌పై దృష్టి సారించారు. ఏయే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని ఉన్నాయో? వాటి లెక్కలు, డిపాజిట్లపై దృష్టి సారించారు. రాష్ట్రంలో దాదాపు 8482 మంది ప్రముఖులు ఆయుధ లైసెన్సును కలిగి ఉన్నారు.



వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వ్యక్తిగత భద్రత కోసం వీటిని కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆయుధాల సంఖ్య దాదాపు 9000 దాటిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందులో దాదాపు 7500లకుపైగా ఆయుధాలు గ్రేటర్‌ పరిధిలో ఉన్నాయని మిగిలినవి జిల్లాల్లో ఉన్నాయని పోలీసుల అంచనా వేస్తున్నారు.



మద్యం సరఫరా, నగదు పంపిణీలాంటి వాటిపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంటారు. మద్యం, నగదుతోపాటు వివిధ రూపాల్లో వారిని ప్రలోభపెడుతుంటారు. ఈసారి పోలీసులు దీనిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.