China Real Estate Crisis : చైనా నుంచి ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు

కరోనా పేరుతో ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది చైనా... మహమ్మారి కోలుకోక ముందే మరో బాంబు పేల్చింది. ఎవర్‌గ్రాండే సంక్షోభం గ్లోబల్‌ మార్కెట్లపై పడింది.

China Real Estate Crisis : చైనా నుంచి ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు

China Real Estate Crisis

China Real Estate Crisis :  కరోనా పేరుతో ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది చైనా… మహమ్మారి కోలుకోక ముందే మరో బాంబు పేల్చింది. ఎవర్‌గ్రాండే సంక్షోభం గ్లోబల్‌ మార్కెట్లపై పడింది. బిలియనీర్లను బిచ్చగాళ్లలా మార్చేస్తోంది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్‌ భారత్‌తో పాటు ఇతర మార్కెట్లను తాకింది. ఇంతకీ ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచ మార్కెట్లపై ఎందుకు ప్రభావం చూపుతోంది ?

చైనా సృష్టిస్తున్న సమస్యలు ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కరోనా నుంచి పూర్తిగా బయటపడక ముందే ఎవర్‌గ్రాండే రూపంలో మరో సమస్యను సృష్టించింది డ్రాగన్ కంట్రీ. ఈ సంక్షోభం గ్లోబల్‌ మార్కెట్లను షేక్‌ చేసి పారేస్తోంది. ఇప్పటికే ఆ ప్రకంపనలు భారత్‌ మార్కెట్లను తాకాయి. అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం అయ్యేలా కన్పిస్తోంది. చైనాలోనే అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం.. ఇప్పుడు దివాలా తీసే పరిస్థితికి వచ్చింది.

ఆ ప్రభావం ఆ దేశానికే పరిమితం కాకుండా ఇతర దేశాలపైనే పడుతోంది. మార్కెట్ల ప్రతికూలత బిలియనీర్లను బిచ్చగాళ్లలా మార్చేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌లో ఓ వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. ఇక ఎవర్‌గ్రాండేలో సంస్థ నిర్మించే ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన వారంతాఆ కంపెనీ ముందు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ పరిణామాలన్నీ ముందున్న అతిపెద్ద ముప్పును సూచిస్తున్నాయి.

ఎవర్‌గ్రాండే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల డాలర్ల మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్‌ బాండ్స్‌ అంటే పెట్టుబడి గ్రేడ్‌లో లేని సంస్థల బాండ్ల ఈల్డ్‌ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఈ నీటి బుడగ పేలిపోయే పరిస్థితి వచ్చింది. ఎవర్‌గ్రాండే సంస్థ చైనాలోనే అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం. ఈ కంపెనీ 280 కంటే ఎక్కువ నగరాల్లో ఏకంగా 1300 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. చైనా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో 2 శాతం వాటా దీనిదే.

ఒక్క రియల్‌ ఎస్టేట్‌ రంగమే కాదు…ఎలక్ట్రిక్‌ కార్స్‌ యూనిట్‌, టూరిజం, డిజిటల్‌ ఆపరేషన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం కుదర్చుకున్న అగ్రిమెంట్ల ప్రకారం 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. వారంతా ఇప్పటికే ఆ కంపెనీకి పూర్తిగా డబ్బులు చెల్లించేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం సంగతి పక్కన పెడితే అసలు కంపెనీ ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఈ కంపెనీలో 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఈ సంక్షోభం చైనాలో లక్ష కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తి ప్రాజెక్టులపై పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అసలు ఆ దేశ జీడీపీలో 29 శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచే వస్తోంది. అంటే అదెంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్నాళ్ల నుంచి ఈ రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. దీంతో ఎవర్‌గ్రాండ్‌ సంస్థ కూడా కుప్పకూలిపోయింది. ఆగస్టు నెలలో ఇళ్ల విక్రయాలు 20 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం అక్కడ 6.5 కోట్ల ప్రాపర్టీలు ఖాళీగానే పడి ఉన్నాయి.

ముందంతా విచ్చలవిడిగా రుణాలు ఇచ్చారు. ఆ తర్వాత నిబంధనల పేరుతో ఒక్కసారిగా డోర్స్‌ క్లోజ్‌ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి అదే కారణంగా మారుతోంది. ఈ ప్రభావం మార్కెట్లను తాకడం మొదలు పెట్టింది. హాంకాంగ్‌లోని హాంగ్‌ సెంగ్‌ 11 నెలల కనిష్టాన్ని తాకింది. జపాన్‌లోని నిక్కీ మార్కెట్ 2 శాతానికి పడిపోయింది. భారత మార్కెట్లపై ఒక శాతం ప్రభావం పడింది. మున్ముందు ఈ ఎఫెక్ట్‌ ఇంకెంతలా పెరుగుతుందనేది టెన్షన్‌ పెట్టిస్తోంది.