Eatala Rajender: బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం కేసీఆర్..! 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ ఈటల రాజేందర్..
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
Eatala Rajender: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీజేపీ కీలక నేత, ఎంపీ ఈటల రాజేందర్ పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం ఎవరు? కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? కేసీఆర్ చేసిన తప్పులు ఏంటి? అన్న ప్రశ్నకు ఈటల రాజేందర్ ఏమని చెప్పారంటే..
”కేసీఆర్ నియంతృత్వ వైఖరే బీఆర్ఎస్ ఓటమికి కారణం. ఆయన వల్లే పార్టీ ఓడిపోయింది. కేసీఆర్ కనుక తన నియంతృత్వ పోకడను వదిలేసుకుని ఉంటే, అందరినీ గౌరవప్రదంగా చూసుకుని ఉండి ఉంటే, కుటుంబసభ్యుల్లా ఉండుంటే.. కేసీఆర్ ఓడిపోయే వ్యక్తి కాదు. పార్టీ కూడా ఓడిపోయేది కాదు. పార్టీ ఓటమికి సంపూర్ణ కారణం కేసీఆర్.
తెలంగాణలో నేడు ఫోన్ ట్యాపింగ్ కి, భూదందాలకు, అవినీతికి, తెలంగాణలో తలెత్తుకోకుండా ఉండటానికి మొత్తం కారకుడు కేసీఆర్. మరెవరూ కాదు. ఎంపీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, సీతారం నాయక్ ఇలా అందరినీ మార్చేశారు. ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
అలా కాకుండా.. ఎవరు పోయినా నన్ను ఏమీ చేసేది లేదు.. నేనే కర్త, కర్మ, క్రియ.. నేను స్ట్రాంగ్ ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. అని కేసీఆర్ అనుకున్నారు. అలా అని అందరినీ తీసిపడేశారు. మీ పార్టీ నుంచి 90 మంది గెలిచాక.. మళ్లీ బయటి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏ కారణాల వల్ల మంత్రివర్గాన్ని మొత్తం వేయలేకపోయారు? ఇలాంటి కారణాలతో ప్రజలు అస్యహించుకున్నారు. బీఆర్ఎస్, ఓటమికి అసలు కారణం కేసీఆరే” అని ఈటల రాజేందర్ అన్నారు.
