Evergrande Crisis : చైనాలో ‘ఎవర్‌గ్రాండ్‌’ సంక్షోభం..! ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్‌ మార్కెట్‌లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.

Evergrande Crisis : చైనాలో ‘ఎవర్‌గ్రాండ్‌’ సంక్షోభం..! ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

China

Evergrande crisis in China : చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్‌ మార్కెట్‌లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. సంక్షోభం మరింత ముదిరితే భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఇబ్బంది తలెత్తనుంది. ఎవర్‌గ్రాండ్‌ స్థిరాస్తి కంపెనీ 1996లో ఏర్పాటైంది. అధిక భాగం లోన్స్ తో నడుస్తున్న ఈ కంపెనీకి 280 నగరాల్లో 1,300కు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంటర్నెట్‌, మీడియా కంపెనీ, విద్యుత్‌ వాహనాలు, థీమ్‌ పార్కు, మినరల్‌ వాటర్‌, ఫుడ్‌ కంపెనీలు ఉన్నాయి. చైనా స్థిరాస్తి విపణిలో 2శాతం వాటా ఎవర్ గ్రాండ్ దే అంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీకి గతేడాది ద్రవ్య లభ్యత సమస్య తలెత్తింది.

మొత్తం 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉండగా, తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. 2021 జనవరిలో చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఇబ్బందులు రావొచ్చని గత ఆగస్టులోనే కంపెనీ అంచనా వేసింది. ఈ కంపెనీకి సుమారు రూ.22.50 లక్షల కోట్ల అప్పులు ఉండటంతో తగ్గించుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. 2023 మధ్య కల్లా సుమారు రూ.7.50 లక్షల కోట్ల లోన్స్ తీర్చాలని భావిస్తోంది. అయితే అందుకనుగుణంగా స్థిర ప్రణాళిక రూపొందలేదు. ఇప్పటివరకు 8 బిలియన్‌ డాలర్లనే సమీకరించింది.

China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..

ఈ ఏడాది చివరకు వడ్డీ కింద 669 మిలియన్‌ డాలర్లు కట్టాల్సివుంది. వచ్చే మార్చికి 2 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌లో 1.45 బిలియన్‌ డాలర్లను కంపెనీ చెల్లించాల్సి ఉంది. స్టాక్‌ మార్కెట్ల ద్వారా సరైన సమయంలో నిధులను సమీకరించడం కూడా కంపెనీకి సవాల్ గా మారింది. చైనా ప్రభుత్వం కూడా సాయం చేయాలా వద్దా అన్న సందిగ్ధదంలో పడినప్పటికీ కాపాడకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భయపడుతోంది. ఈ నెల 23కు 83.5 మిలియన్‌ డాలర్ల వడ్డీని సైతం కట్టలేమని ఎవర్‌గ్రాండ్‌ ఇటీవల ప్రకటించడంతో మార్కెట్లు షాక్‌కు గురయ్యాయి. ఫలితంగా ముడి ఇనుము ధర గత వారం 22 శాతం క్షీణించి టన్ను 110.45 డాలర్లకు పరిమితమైంది.

కంపెనీ ఎగవేతదారుగా మారుతుందనే భయాలతో ఎవర్‌గ్రాండ్‌ షేర్లు సోమవారం హాంకాంగ్‌లో 19శాతం మేర పడ్డాయి. ఈ ప్రభావం సోమవారం భారత స్టాక్‌ మార్కెట్లలో లోహ షేర్లపై పడింది. టాటా స్టీల్‌ 9.53శాతం, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 9.13శాతం, నేషనల్‌ అల్యూమినియం కంపెనీ 8.92శాతం, సెయిల్‌ 8.20శాతం, ఎన్‌ఎండీసీ 7.70శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6.99శాతం, హిందాల్కో 6.07శాతం, వేదాంతా 4.99శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎవర్‌గ్రాండ్‌ సంస్థ కుప్పకూలితే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరలు క్షీణిస్తాయి. చైనీయుల సంపదలో చాలా భాగం స్థిరాస్తి రంగంలోనే ఉండడం వల్ల వారి ఖర్చులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీంతో చైనా ఆర్థిక మందగమనానికి గురి కావొచ్చని అంటున్నారు.

China Best Cars : ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారుచేస్తున్న డ్రాగన్ చైనా!

ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభం కారణంగా చైనా యువాన్‌ క్షీణిస్తే జౌళి, టైర్లు, రసాయనాల రంగాల్లోని భారత కంపెనీలకు చైనా కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చు. వర్థమాన మార్కెట్ల నుంచి వచ్చే పలు ఉత్పత్తులకు చైనాయే అతిపెద్ద కొనుగోలుదారు. రష్యా నుంచి ఇంధనం, తైవాన్‌ నుంచి సెమీ చిప్స్‌, బ్రెజిల్‌ నుంచి ఆహారం, కొరియా నుంచి యంత్ర పరికరాలు, సింగపూర్‌ నుంచి షిప్పింగ్‌ సేవలు, భారత్‌ నుంచి ముడి ఇనుము కొనుగోలు చేస్తోంది. చైనా కష్టాల్లో పడితే, వీటిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఐరోపాకు చెందిన విలాసవంతమైన వస్తువుల తయారీ కంపెనీల ఆదాయంలో సగం చైనా నుంచి వస్తుండటం గమనార్హం. జర్మనీ ఎగుమతుల్లో 10 శాతం చైనాకే వెళ్తాయి. ఎవర్ గ్రాండ్ సంక్షోభం నేపథ్యంలో వీటికి కష్టాలు తప్పలాలేవు.