ఢిల్లీ అల్లర్లలో 2,000 కేజీల ఇటుకలు వాడారట.. భీకరంగా కనిపిస్తున్న వీధులు!

  • Published By: sreehari ,Published On : February 28, 2020 / 05:08 AM IST
ఢిల్లీ అల్లర్లలో 2,000 కేజీల ఇటుకలు వాడారట.. భీకరంగా కనిపిస్తున్న వీధులు!

ఢిల్లీ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన వ్యక్తం చేస్తూ పరస్పరం రాళ్లు, ఇటుకులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. చాలా మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ అల్లర్లలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ రాళ్లు, ఇటుక ముక్కలతో నిండిపోయాయి. 

ఎక్కడ చూసిన రోడ్లన్నీ రాళ్లు, ఇటుకలే కనిపిస్తున్నాయి. చెత్త, వ్యర్థాలతో నిండిపోయాయి. ఆందోళనకారులు గుంపులుగా వచ్చి రోడ్లపై ఏది దొరికితే అవి తీసుకుని ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు, ఇటుక ముక్కలు ఒకరిపై మరొకరు విసురుకున్నారు. దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు తూర్పు ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ (EDMC) రంగంలోకి దిగింది. 

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రోడ్లపై చెత్తను శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. భజాన్ పురా, యుమునా విహార్, జఫ్రాబాద్, ఖాజూరీ ఖాస్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా పేరుకుపోయిన రాళ్లు, ఇటుక ముక్కలను ట్రక్కుల్లో తరలిస్తున్నారు అధికారులు. ‘ఒక్క కర్దాంపూరిలో మాత్రమే 2వేల కేజీలకు పైగా ఎర్ర ఇటుకలను తొలగించినట్టు ఈడీఎంసీ పేర్కొంది. ఆందోళనకారులు.. ఇటుకలన్ని వీధుల్లో కుప్పలుగా పోసి ఉంచినట్టు ఈడీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. కాల్చేసిన దుస్తులు, ఫర్నీచర్, టైర్లు, పగిలిన అద్దాలు, కిటీకిలు ఇలా ఎన్నో వ్యర్థాలుగా రోడ్లపై పడి ఉన్నాయని వాటిని తొలగించినట్టు చెప్పారు. 

మంటల్లో దగ్ధమైన మోటార్ బైకులు, కార్లను ఇంకా తొలగించాల్సి ఉందని, పోలీసుల వీడియోగ్రాఫ్ కోసం వాటిని అలాగే ఉంచినట్టు తెలిపారు. ఈ వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరో గుర్తించి ఇన్సూరెన్స్ కోసం క్లయిమ్ చేసుకోవచ్చున్నారు. కాలిపోయిన వాహనాలను గుర్తించడం కాస్తా కష్టంగా ఉంటుందని చెప్పారు. క్లాసిక్ ప్లేట్ ఆధారంగా మాత్రమే వాటిని గుర్తించే వీలుందన్నారు. అది కూడా ధ్వంసం కాకుండా ఉంటే తప్ప.. అందుకే వాటిని ఉన్న చోటనే ఉంచాల్సి వచ్చిందని డిప్యూటీ కమిషనర్, శార్దా (నార్త్) జోన్ ఈడీఎంసీ రానెన్ కుమార్ తెలిపారు. 

Also Read |  ఢిల్లీ అల్లర్ల మధ్య హిందూ-ముస్లిం పెళ్లి