ఇంట్లో పేలిన TV, ఫ్రిడ్జ్ : నిద్రలోనే కుటుంబం అగ్నికి ఆహుతి!

10TV Telugu News

ఇంట్లో తలుపు మూసి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారు. ఐదుగురు చిన్నారులు సహా 40ఏళ్ల మహిళ ఊపిరాడక మృతిచెందింది. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ ‘లొని’ టౌన్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

మృతుల్లో 5ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా కుటుంబ సభ్యులు మీరట్‌లోని ఓ పెళ్లికి వెళ్లగా, చిన్నారులు తమ అత్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. రాత్రి సమయంలో షాట్ సర్య్కూట్ కావడంతో ఫ్రిడ్జ్, టీవీ పేలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఇంటి తలుపు, కిటికిలు వేయడంతో దట్టమైన పొగ ఇళ్లంతా వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు చెప్పారు. మంటలు వ్యాపించడంతో వారి శరీరాలు చాలావరకు కాలిపోయాయని ఘజియాబాద్ రూరల్ ఎస్పీ నీరజ్ కుమార్ జాదన్ తెలిపారు. బయట బాగా చలిగా ఉండటంతో ఈ ఆరుగురు ఇంటి తలుపులు మూసి నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని, రిపోర్టు వచ్చాక ఏ కారణంతో మృతిచెందారు అనేది నిర్ధారిస్తామని చెప్పారు. ఫ్రిడ్జ్, టీవీలో నుంచి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడకనే మృతిచెంది ఉంటారని ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు జాదన్ తెలిపారు.