ఆలయం పక్కనే మంటల్లో కాలిపోయిన ఆమె ఎవరు : ప్రియాంక ఘటన మరువక ముందే మరో దారుణం

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 03:35 AM IST
ఆలయం పక్కనే మంటల్లో కాలిపోయిన ఆమె ఎవరు : ప్రియాంక ఘటన మరువక ముందే మరో దారుణం

శంషాబాద్‌లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్‌ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దీంతో.. ముందుగా మృతురాలిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతుండగానే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియాంకను హత్య చేసిన కిలోమీటర్ దూరంలోనే మరో మహిళ నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయింది. సిద్దులగుట్ట రోడ్డులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన శుక్రవారం(నవంబర్ 29,2019) రాత్రి 10గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ మంటల్లో కాలిపోయింది. అటుగా వెళ్తున్న వారు దీనిని చూసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి దుస్తులు, చెప్పులు, గాజులు, ఓ ఆస్పత్రికి చెందిన ఫైలును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్‌.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 

అయితే.. ఈ మృతదేహం ఎవరిది? ప్రియాంక తరహాలోనే ఈమెపై అత్యాచారం చేశారా? ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేదంటే ఇక్కడే అత్యాచారం చేసి చంపారా? అదీ కాదంటే.. ఆమెనే ఆత్మహత్య చేసుకుందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఇంతదూరం వచ్చి మంటలు అంటించుకుంటుందా?… అది కూడా పక్కనే ఓ షూటింగ్ జరుగుతుండగా… ఈ పనికి పాల్పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈమెను ఎవరైనా హత్య చేసి ఉంటే… అది ఎవరు? ఎందుకు చంపారు? హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? అత్యాచారం చేసి హత్య చేశారా? లేదంటే మరే కారణమైనా ఉందా అన్నవి పోలీసులకు కూడా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలాయి.

అయితే..ఈ కేసు చిక్కుముడిని విప్పాలంటే.. ముందుగా ఆమె ఎవరన్నది తెలియాలి. ఆ తర్వాతే అక్కడ ఏం జరిగిందన్నది తెలిసే అవకాశం ఉంది. అందుకే ఆమెను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఘటనా స్థలంలో దొరికిన ఫైలు… ఫిల్మ్‌నగర్‌ చల్లా ఐకేర్ ఆస్పత్రికి చెందినదని… ఆ ఫైలులో ఉన్న దానిని బట్టి ఆమె పేరు రాధ అని గుర్తించారు. అయితే.. ఆ ఫైలు కూడా సగానికిపైగా కాలిపోవడంతో పూర్తి వివరాలు తెలియడం లేదు. దీంతో సమీపంలోని పోలీస్‌ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. 

ఇప్పటికే శంషాబాద్ చుట్టుపక్క రోడ్లలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు… సిద్దులగుట్ట రోడ్డులోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రియాంక కేసు తరహాలోనే ఈ కేసును కూడా త్వరలోనే ఛేదిస్తామని చెబుతున్నారు.