ఎమ్మెల్యేల హానీ ట్రాప్ : 8 మంది అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : November 30, 2019 / 06:16 AM IST
ఎమ్మెల్యేల హానీ ట్రాప్ : 8 మంది అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో  ఎమ్మెల్యేలు టార్గెట్ గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.  వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు, మంజునాధ్ లతో పాటు….కోరమంగలకు చెందిన పుష్ప, బనశంకరికి చెందిన పుష్పలను మరో నలుగురిని బెంగుళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా ఉత్తర కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే పై హానీ ట్రాప్ ప్రయోగించి గత ఏడాది కాలంగా  కోటి రూపాయలు పైగా డబ్బు వసూలు చేశారు. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు కళకప్పబండి, రఘుపతి భట్‌, రఘుపతి ఆచార్‌, శివరాం హెబ్బార, గళిహట్టి శేఖర్‌, రాజశేఖర్‌ పాటిల్‌తోపాటు పలువురు ఇరుక్కున్నట్టు తెలుస్తోంది.

అరెస్టైన మహిళలు మొదట ఎమ్మెల్యేల వద్దకు తమ కష్టం చెప్పుకునే వారిలా వెళ్లి వారితో క్రమేపి పరిచయం పెంచుకునేవారు.తర్వాత వారిని మాటలతో హోటల్ రూములకు రప్పించే వారు. అక్కడ వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఈ ముఠా వీడియో తీసేది. అనంతరం ఆ వీడియోలు చూపించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి, వారి వద్దనుంచి డబ్బు  వసూలు చేస్తున్నారు. 

ఉత్తర కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే వీరి హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. ఆయనతో ఈ మహిళలు సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించటంతో… ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు.  కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున  నిందితులను మీడియా ముందు చూపించలేమని పోలీసులు తెలిపారు.