నైట్ క్లబ్బులపై దాడులు 275 మంది అరెస్ట్

నైట్ క్లబ్బులపై దాడులు 275 మంది అరెస్ట్

BMC conduct surprise raids on night clubs : కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి నిర్వహిస్తున్న నైట్ క్లబ్బులపై ముంబై నగరపాలక సంస్ధ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వద్దనుంచి 43,200 రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. ఒక నైట్ క్లబ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోవిండ్ నిబంధనలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యజమానులు తమ పద్దతి మార్చుకోకపోతే అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు కర్ఫ్యూ విధిస్తామని బీఎంసీ కమీషనర్ ఇక్బాల్ సింగ్ గతంలోనే హెచ్చరించారు.

అయినప్పటికీ క్లబ్ యాజమానుల్లో మార్పురాలేదు. క్లబ్లుల్లోకి వచ్చిన కస్టమర్లు కనీసం ముఖాలకు మాస్క్ లు కూడాధరించటంలేదు. సామాజిక దూరాన్ని పాటించటంలేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల మళ్లీ కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. నియమాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఇక్బాల్ సింగ్ సూచించారు.

సోమవారం రాత్రి బీఎంసీ అధికారులు దాదర్‌లోని ప్రీతం హోటల్, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్‌ క్లబ్బుల్లో కరోనా నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో నైట్‌ క్లబ్‌లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్‌ ధరించలేదు. సామాజిక దూరాన్ని అసలు ఎవరూ పాటించటంలేదు.

దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్‌ యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులతోపాటు జరిమానా విధించారు. ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్‌ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు.

కానీ, నైట్‌ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్‌ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని ఇక్బాల్ సింగ్ హెచ్చరించారు. క్లబ్‌ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు.