Chennai Bank Robbery : బాబోయ్.. బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.20కోట్ల విలువైన బంగారం చోరీ

చెన్నెలోని బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.20 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు దొంగలు. అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారం దోచుకెళ్లారు.

Chennai Bank Robbery : బాబోయ్.. బ్యాంకులో భారీ దోపిడీ.. రూ.20కోట్ల విలువైన బంగారం చోరీ

Chennai Bank Robbery : చెన్నెలోని బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.20 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు దొంగలు. చెన్నై నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారం దోచుకెళ్లారు. కస్టమర్ల మాదిరిగా బ్యాంకులోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. బ్యాంకు సిబ్బందికి కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు.

దొంగలు ఇచ్చిన మత్తుమందు కారణంగా బ్యాంకులోని సిబ్బంది స్పృహ కోల్పోగా.. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే దొంగలు బంగారం ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బ్యాంకు అధికారులు జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి దొంగ‌ల కోసం గాలింపు చేపట్టారు.

ఫెడ్ గోల్డ్ బ్యాంకు బంగారం తాకట్టుపై రుణాలు ఇస్తుంది. శనివారం సాయంత్రం మాస్కులు ధరించిన ముగ్గురు బ్యాంకులోకి ప్రవేశించారు. వినియోగదారులు తనఖా పెట్టిన బంగారాన్ని ఉంచే స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు తీసుకుని.. స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచారు. అందులో ఉన్న సుమారు 32 కేజీల బంగారాన్ని పాలిథిన్‌ సంచుల్లో వేసుకుని పారిపోయారు.

కాగా, ఆ బ్రాంచ్‌ను శనివారం మూసివేశారని, లెక్కల కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ తెలిపారు. దోచుకున్న బంగారం విలువ కోట్లలో ఉంటుందని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

బ్యాంకులో జరిగిన భారీ చోరీ సంచలనం రేపింది. కాగా, ఈ చోరీ వెనుక బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. చోరీ జరిగిన బ్యాంకు ఉన్న పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఫెడ్ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం ఆ సంస్థకు దేశవ్యాప్తంగా 463 బ్యాంచులు ఉన్నాయి. గోల్డ్ లోన్స్, హోమ్స్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇస్తుంది.