ఏమీ తెలివి : సొరంగం తవ్వి డీజిల్ చోరీ

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 02:22 AM IST
ఏమీ తెలివి : సొరంగం తవ్వి డీజిల్ చోరీ

హైదరాబాద్ : కేటుగాళ్లు…రెచ్చిపోతున్నారు. కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. డీజిల్ దొంగతనంలో ఈ కేటుగాళ్లు అనుసరించిన విధానం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఏకంగా కేటుగాళ్లు మూడు మీటర్ల లోతు…రెండు మీటర్ల సొరంగం తీసి పైపులైన్‌కి మోటార్ బిగించి విలువైన డీజిల్‌ను దొంగతనం చేశారు. పక్కా ప్లాన్‌తో మూడు నెలలుగా డీజిల్‌ను తస్కరిస్తున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. 
కోటి విలువైన డీజిల్ చోరీ…సొరంగం తవ్వి…
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ జనవరి 17వ తేదీన దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఘట్ కేసర్ నుండి చర్లపల్లిలోని బీపీసీ / ఐవోసీ కంపెనీలకు 17 కి.మీటర్ల మేర సొరంగం గుండా పైపులైన్ ద్వారా డీజిల్ సప్లై అవుతోంది. మహారాష్ట్ర థానే డిస్టిక్ చెందిన హఫీజ్ అజీజ్ చౌదరి, ప.బెంగాల్ నివాసి..ముంబైలో పనిచేస్తున్న జియాహుల్ చంద..లు స్నేహితులు. వీరి కన్ను సరఫరా అవుతున్న డీజిల్‌పై పడింది. ఈ పైపులైన్ నుండి సరఫరా అవుతున్న డీజిల్‌ని తస్కరించాలని పక్కా ప్లాన్ వేశారు. కీసర పీఎస్ పరిధిలో ఓ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నారు. ఇక్కడి నుండి రెండు కిలోమీటర్ల వరకు సొరంగం తవ్వారు. డీజిల్ సరఫరా అవుతున్న పైపులైన్‌కి రంధ్రం వేశారు. దీనికి చిన్న మోటార్ బిగించారు. డీజిల్‌ని దొంగిలించి…ట్యాంకర్లలోకి లోడ్ చేసి విక్రయిస్తున్నారు. ఇలా డిసెంబర్ నుండి 1,30,601 కిలో లీటర్ల డీజిల్..అంటే సుమారు రూ. కోటి విలువైన డీజిల్‌ని దొంగిలించారు. 
ఎలా పట్టుబడ్డారు ? 
బీపీసీఎల్ /  ఐవోసీఎల్ కంపెనీలకు మధ్య డీజిల్ సరఫరా తగ్గుతూ వస్తోంది. ఘట్ కేసర్ నుండి విడుదలవుతున్న డీజిల్…కంపెనీలకు చేరుతున్న డీజిల్ మధ్య తేడా కొట్టింది. దీనిని కంపెనీ యజమానులు గుర్తించారు. వెంటనే కీసర పోలీసులను ఆశ్రయించడం…సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అర్ధరాత్రి వేళ సొరంగం గుండా డీజిల్ తస్కరిస్తున్నట్లు గుర్తించారు. దందాతో సంబంధం ఉన్న 12 మందిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు చందశేఖర్ చెడ్డా, 8 మంది పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నరు. నిందితుల నుండి రూ. 90.4 లక్షల నగదు, ఒక ట్యాంకర్, కారు, ఇతర సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు.