ONGC బావిలో గ్యాస్ లీక్ : భయాందోళనలో కోనసీమ ప్రజలు

  • Published By: chvmurthy ,Published On : February 3, 2020 / 01:58 AM IST
ONGC బావిలో గ్యాస్ లీక్ : భయాందోళనలో కోనసీమ ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ లీకవుతోంది.  దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్‌ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఫిబ్రవరి2వ తేదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఓఎన్‌జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ పెద్ద శబ్దంతో ఎగసిపడింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు గ్యాస్‌ను అదుపుచేసే యత్నం చేశారు. 

అడవిపేట ఓఎన్‌జీసీ డ్రిల్‌ సైట్‌కు అనుబంధంగా ఉన్న ఉప్పూడి–1 బావిలో 2006 ముందు వరకూ ఓఎన్‌జీసీ సొంతంగా గ్యాస్‌ను వెలికితీసింది. తర్వాత బావిలో సహజ వాయువు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో బావిని మూసేసింది. 3 కి.మీ లోతున ఈ బావిలో గ్యాస్‌ ఉంది. 2006లో  ఈ బావికి మూత వేసిన ఓఎన్‌జీసీ.. గతేడాది కోల్‌కతాకు చెందిన పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతో గ్యాస్‌ వెలికితీత ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్నుంచి ఆ సంస్థ పర్యవేక్షణలోనే ఈ బావి నిర్వహణ సాగుతోంది. 

బావిలో గ్యాస్‌ నిల్వలను అంచనా వేసేందుకు మూత తెరిచేందుకు సంస్థ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే గ్యాస్‌ ఒక్కసారిగా ఎగదన్నింది.  తర్వాత బావి నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్‌ ఎగదన్నడంతో ఆ ప్రాంతమంతా మంచు కమ్మేసినట్టుగా గ్యాస్‌ అలముకుంది. చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలపై మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లు, ఫ్లాష్‌ లైట్లు కూడా ఉప్పూడి గ్రామ పరిసరాలకు తీసుకు రాకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కట్టడి చేసింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఘటనా స్థలం చుట్టుపక్కలంతా గాఢాంధకారం అలముకుంది.  ఉప్పూడి గ్రామంలో 1600 మంది దాకా ఉన్నారు. వారిని చెయ్యేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు.  కాగా ….ఘటన జరిగిన కొద్దిసేపటికే బావి వద్ద పనిచేస్తున్న ఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. 

బావిని మూసేశాక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాల్లో భాగంగా బావిని తిరిగి తెరవాలంటే ఓఎన్‌జీసీ నిపుణుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. అటువంటిదేం లేకుండా బావి తెరవడం విస్ఫోటనానికి కారణమైంది. ఈ విస్ఫోటనంతో తమకు సంబంధం లేదని ఓఎన్‌జీసీ చెబుతోంది.  ఈ విషయాన్ని అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా ధ్రువీకరించారు. పీఎఫ్‌హెచ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థపై కేసు నమోదు చేసేందుకు పోలీసు అధికారులు నిర్ణయించారు.