టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు…కీలక పత్రాలు స్వాధీనం

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 10:27 AM IST
టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు…కీలక పత్రాలు స్వాధీనం

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 30 గంటల పాటు తనఖీలు కొనసాగాయి. అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్‌తో పాటు కడప జిల్లాలోని శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. గురువారం ఉదయం శ్రీనివాసులు రెడ్డి ఇంటికి  పోలీసు బలగాలతో ఐటీ అధికారులు వచ్చారు. 

హైదరాబాద్ లోని ద్వారకానగర్ లోని శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో శ్రీనివాసులు రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 
హైదరాబాద్, కడపలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అధికారులు.. కడపలో ఆయన నివాసం దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఆర్‌కె ఇన్‌ఫ్రా అనే కంపెనీ శ్రీనివాసులు రెడ్డికి ఉంది. శ్రీనివాసులు రెడ్డి తండ్రి రాజగోపాల్ రెడ్డి టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. 

ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. బీరువాలు, అల్మారాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. కొంత బంగారం, నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ లాకర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.

మరోవైపు చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. చంద్రబాబు వద్ద శ్రీనివాస్ సుధీర్ఘ కాలం పాటు పీఏగా పని చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత శ్రీనివాస్ తన స్వంత డిపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్లారు. తొలుత శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని ప్రచారం సాగింది. అయితే ఏసీబీ అధికారులు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తాము ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు.