RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు

Fir On Rs Praveen Kumar

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో పెద్దపల్లిజిల్లా జూలపెల్లి మండలం ధూళికట్ట గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గోన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ ద్వారా హిందూ దేవతలను కించపరిచారంటూ మార్చి లో బేతి మహేందర్ రెడ్డి అనే న్యాయవాది ప్రవీణ్ కుమార్ పై పోలీసు స్టేషన్ లో తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

ధూళికట్ట గ్రామంలో స్వేరో సభ్యులతో కలిసి స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞలో హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధ కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ  చేయించారు.

స్వేరోస్ సభ్యులందరు ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీటిని చూసిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన మత విశ్వాసాలను దెబ్బతీసినారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి హిందు దేవుళ్లను ఆవమానించి, కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేశారంటూ మార్చి16న కరీంనగర్ 3వ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈకేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ప్రిన్సిపల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ ద్వారా కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.

కేసులో ఆధారాలు, పూర్వపరాలు పరిశీలించిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి సాయిసుధ నగరంలోని మూడో పట్టణ పోలీసులను ఆదేశిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.

గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేస్తూ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖకు తెలంగాణ   ప్రభుత్వం సానుకూలంగా  స్పందిస్తూ మంగళవారం ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేసింది.  ఆయన స్ధానంలో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పచెప్పింది.