స్కూల్ నిర్లక్ష్యం : క్లాసు రూంలో పాము కరిచి బాలిక మృతి

  • Published By: sreehari ,Published On : November 21, 2019 / 01:07 PM IST
స్కూల్ నిర్లక్ష్యం : క్లాసు రూంలో పాము కరిచి బాలిక మృతి

స్కూల్ క్లాసు రూంలో పాము కరిచి పదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఉత్తరాది కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. చిన్నారికి పాము కరిచిందని తోటి విద్యార్థులు చెప్పినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్.షీహాలా అనే విద్యార్థిని సుల్తాన్ బథేరిలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. తరగతి గదిలో కాంక్రీట్ ప్లోర్‌పై రంధ్రం ఉంది. అక్కడే కూర్చొన్న చిన్నారి కాలిని రంధ్రంలో నుంచి పాము పలుమార్లు కాటేసింది. 

పాము కరిచిన విషయం తోటి విద్యార్థులు టీచర్లకు చెప్పారు. కానీ, స్కూల్ సిబ్బంది మాత్రం.. చిన్నారి గోరు లేదా ఏదైనా రాయి గీసుకుని గాయమై ఉంటుందని కొట్టిపారేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఉండిపోయారుని విద్యార్థులు వాపోయారు. కనీసం గంటపాటు చిన్నారి అలానే స్కూల్లో ఉండిపోయింది. కాసేపటికి ఆమె పాదాలు నీలంగా మారిపోయాయి. అప్పుడే బాలిక తండ్రి స్కూలుకు చేరుకున్నాడు. చిన్నారి పాదానికి బ్యాండేజీ కట్టి ఉంది. వెంటనే బాలికను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు.  ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

కానీ, అక్కడి వైద్యులు.. 88కిలోమీటర్ల దూరంలోని ఖోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది. పాము కాటేసిన విద్యార్థిని మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి షీహాలా మృతిచెందింది. విద్యార్థిని మృతికి కారణమైన స్కూల్ టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.