గోల్కొండ మహంకాళి ఆలయంలో చోరీకి యత్నం

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 09:44 AM IST
గోల్కొండ మహంకాళి ఆలయంలో చోరీకి యత్నం

హైదరాబాద్ : గోల్కొండ కోట మహంకాళి అమ్మవారు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బోనాలు ప్రారంభం. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలు తొలి బోనాలు మహంకాళి అమ్మవారికే. అంత విశిష్టత ఉన్న ఈ ఆలయంలో భారీ చోరీ ప్రయత్నం జరిగింది. 2019, ఫిబ్రవరి 3వ తేదీ ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

గోల్కొండ కోటలోని గదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) ఆలయం హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. కానులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైతం పగలగొట్టారు. చోరీ దృశ్యాలు నమోదు కాకుండా దొంగలు జాగ్రత్తపడ్డారు. ఫిబ్రవరి 4వ తేదీ సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు విషయాన్ని ఆలయ పూజరి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈవోకి చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

 

భారీ దోపిడీకి యత్నం :

ఆలయం పరిధిలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దొంగలు.. గ్రిల్స్‌ మధ్య ఉన్న హుండీని కర్రల సాయంతో పక్కకు లాగారు. ఆ తర్వాత తాళం పగులగొట్టి కానుకలను అపహరించేందుకు ప్రయత్నించినట్టు సీన్ చూస్తే తెలుస్తోంది. అయితే హుండీ తాళాలు రాకపోవటంతో చోరీ ప్రయత్నం విఫలం అయ్యింది. కోట ప్రధాన ద్వారం దగ్గర 24 గంటల సెక్యూరిటీ ఉన్నా.. చోరీకి ఎలా ప్రయత్నించారనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.