ఎన్ కౌంటర్లు, ఉరిశిక్షలు పరిష్కారం కాదు : దిశ ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 02:37 AM IST
ఎన్ కౌంటర్లు, ఉరిశిక్షలు పరిష్కారం కాదు : దిశ ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులను ప్రశంసించారు. మంచి పని చేశారని కొందరు, ఇన్ స్టంట్ జస్టిస్ అంటే ఇదే మరికొందరు కామెంట్ చేశారు. ఇలా ఎన్ కౌంటర్ చేస్తేనే మృగాళ్లలో భయం మొదలవుతుందని.. మహిళలపై చెయ్యి వెయ్యాలంటే భయపడే పరిస్థితి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అయితే దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యాచారాలు లాంటి నేరాలకు చంపడం, ఉరి వేయడం వంటి శిక్షలు.. సమస్యకు పరిష్కారం కాదన్నారు. అవి తాత్కాలిక పరిష్కారాలే కానీ శాశ్వత పరిష్కారాలు కావని స్పష్టం చేశారు. దిశ లాంటి ఘటనలు జరగక్కుండా ఉండాలంటే.. ముందుగా సమాజంలో మార్పు రావాలన్నారు. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని చెప్పారు.

టెక్నాలజీ లోక కల్యాణం కోసం ఉపయోగపడాలి కానీ, అదే జీవితాన్ని విధ్వంసం చేస్తుందని మనిషి ఊహించలేకపోయాడని మంత్రి వాపోయారు. కొన్ని సందర్భాల్లో కంచె చేను మేసినట్టుగా కన్నతండ్రులే తమ పిల్లలపై క్రూరమృగాల్లా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు, టీవీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం మనిషి సుఖమయ జీవనానికి ఉపయోగపడేలా ఉండాలని అభిలషించారు. అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల జరుగుతున్న వరుస ఘోరాలతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. పిల్లలు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగొస్తారో లేదోనని భయపడుతున్నారని చెప్పారు. నాగరికత ప్రపంచంలో మానవ సంబంధాలు నాశనం అయ్యాయని మంత్రి ఆవేదనగా అన్నారు. మనిషికి, జంతువులకు ప్రధాన తేడాలను గమనించాలని సూచించారు.

టెక్నాలజీ ఇంత పెరిగినా.. సమాజంలో మూఢ నమ్మకాలు, మంత్రాల నెపంతో చంపడం దుర్మార్గమని, ఇలాంటి అనాగరికమైన సంఘటనలు జరగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం (డిసెంబర్ 14,2019) ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మానవ వికాస వేదిక మహా సభ’లో ప్రసంగిస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానవ వికాస వేదిక లాంటి సంస్థలు ప్రజలను చైతన్య పరచాలని మంత్రి పిలుపునిచ్చారు.

Also Read : మగాళ్లతో పోలిస్తే.. మహిళల బట్టలెందుకింత పలచన?