తెరపైకి ఓటుకు నోటు కేసు:వేం నరేందర్ రెడ్డికి నోటీసులు

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 04:18 PM IST
తెరపైకి ఓటుకు నోటు కేసు:వేం నరేందర్ రెడ్డికి నోటీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత వేం.నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపిన ఈ కేసులో చార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చెయ్యడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ ప్రారంబించింది. ఈ కేసులో ఉన్న ముద్దాయిలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు చార్జ్ షీట్లు దాఖలు చేయ్యడంతో ఈకేసును ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తుంది. శాసన మండలికి కోటాలో టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు వేం నరేందర్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి,సండ్ర వెంకట వీరయ్య,సెబాష్టియన్,ఉదయ్ సింహా లు కలిసి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ. గతంలో ఈ కేసులో ఉన్న వారందరి ఇండ్లలో సోదాలు జరిపి కేసులు నమోదు చేసింది ఏసిబి. మరోవైపు వీరిపై ఏసీబీ చార్జ్ షీట్లు కూడా ధాఖలు చేయ్యడంతో ఇప్పుడు ఈడీ ఈ కేసుతో వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసింది.

అప్పట్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపి అనేక కీలక ఆధారాలు సేకరించారు. ఇక గతంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తూ పట్టుబడిన నేపధ్యంలో మిగిలిన 4 కోట్ల ఎక్కడ ఉంచారన్న దానిపై ఐటీ అధికారులు ఆరా తీసారు. ఇక ఈ కేసులోనే గతంలో రేవంత్ రెడ్డి ఇంటితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఉదయ్ సింహా,సెబాష్టియన్  ఇళ్ళలో  కూడా సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు సేకరించారు ఐటీ అధికారులు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకుని ఇప్పడు ఈ కేసులో ఈడీ మళ్లీ నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ వేగవంతం చేస్తోంది

ఈ కేసులో నిందితుల పై చార్జ్ షీట్ ధాఖలు చేసిన ఏసిబి కుట్ర పూర్వకంగానే ప్రత్యర్ధిని డబ్బులతో ప్రలోభ పెట్టారని గుర్తించింది. ఈ నేపధ్యంలోనే మరోసారీ ఈ కేసులో  ఉన్న వారిపై ఈడీ ఆరా తీస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ రేవంత్, సండ్ర సహా నిందితులకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి మామ పద్మనాభరెడ్డితోపాటు ఓటుకు కోట్లు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయ్‌సింహా లను సైతం ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల వ్యవహారంపైనే విచారణ చేపట్టనున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం విచారణ  ఓటుకు నోటు కేసు పై సాగడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.