25 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడి వివాహం…

  • Published By: murthy ,Published On : June 7, 2020 / 08:09 AM IST
25 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడి వివాహం…

విడాకులు తీసుకున్న 25ఏళ్ళ యువతితో…18 ఏళ్ల యువకుడికి వివాహాం చేయాలని పెద్దలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. కారు,బంగ్లా, బంగారం ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడితో 25 ఏళ్ల యువతికి తాళి కట్టించాలనుకున్న ప్రయత్నాన్ని తమిళనాడు అధికారులు  విఫలం చేశారు. 

తమిళనాడులోని  వేలూరు సమీపంలోని అరియూర్ కు చెందిన 18 ఏళ్ల యువకుడికి, వారి బంధువైన25 ఏళ్ల యువతితో పెళ్లిచేసేందుకు యువకుడి తండ్రి ప్రయత్నించాడు. ఆ యువతికి అంతకు ముందే వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఆమె మొదటి భర్తనుంచి విడాకుల పొంది ఉంది. 

ఈ క్రమంలో తమ కుమార్తెకు ద్వితీయవివాహం చేయాలని భావించిన తల్లితండ్రులు యువకుడి తండ్రిని సంప్రదించారు. వివాహం ఖాయం చేసుకున్న వీరు జూన్ 12న ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

కాగా….. వధూవరుల మధ్య ఉన్నవయస్సు తేడా రీత్యా వరుడి తల్లి, సోదరి ఈవివాహాన్ని వ్యతిరేకించారు. కానీ  మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పెళ్లి  ఎట్టాగైనా ఆపాలని నిశ్చయించుకున్న వరుడి తల్లి ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. 

దీంతో అధికారులు అరియార్ పోలీసుల సహయంతో గురువారం ఇంటికివెళ్ళి విచారణ జరిపి యువకుడి వయస్సు నిర్ధారణ చేసుకున్నారు. పురుషుడి వివాహ వయస్సు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని…ఈలోపు వివాహం జరిపిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించి వచ్చారు.