టెంపర్ సినిమా వివాదం : నాకు హోంమంత్రి సుచరిత, బొత్స తెలుసని బెదిరించాడు

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 06:09 AM IST
టెంపర్ సినిమా వివాదం : నాకు హోంమంత్రి సుచరిత, బొత్స తెలుసని బెదిరించాడు

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అర్థరాత్రి తన ఇంటిపై బండ్ల గణేశ్‌ దాడి చేశారని, తనను బెదిరించారని పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు విషయంలో బండ్ల గణేశ్ మోసం చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వాలని అడిగినందుకు అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. బండ్ల గణేశ్ పై పీవీపీ హత్యాయత్నం కేసు పెట్టారు. అటు బండ్ల గణేశ్ కూడా పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీవీపీ తనను కిడ్నాప్ చేయబోయారని ఫిర్యాదులో తెలిపారు.

పీవీపీ, బండ్ల మధ్య వివాదం సంచలనంగా మారింది. పీవీపీ, బండ్ల గణేష్ మధ్య గొడవకి కారణం ఏంటి? అర్థరాత్రి బండ్ల గణేష్.. పీవీపీ ఇంటికి ఎందుకు వెళ్లారు? టెంపర్ సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవకు దారితీసిన ఆర్థిక వ్యవహారాలు ఏంటి? అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈ వివాదంపై నిర్మాత పీవీపీ స్పందించారు. అసలు ఏం జరిగిందో వివరించారు. 2013లో టెంపర్ సినిమాకి బండ్ల గణేష్ తన దగ్గర రూ.30కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారని పీవీపీ చెప్పారు. సినిమా విడుదల అయ్యాక రూ.23 కోట్ల చెక్ ఇచ్చారని వివరించారు. ఇంకా రూ.7 కోట్లు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని పీవీపీ ఆరోపించారు. ఈ క్రమంలో శుక్రవారం(అక్టోబర్ 4,2019) అర్థరాత్రి బండ్ల గణేశ్ అనుచరులు ముగ్గురు తన ఇంటికి వచ్చారని, బండ్ల గణేష్ విషయం సెటిల్ చేసుకోవాలని నాతో గొడవకు దిగారని చెప్పారు. తన ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేందుకు బండ్ల గణేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పీవీపీ అన్నారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు నేను భయపడను అని స్పష్టం చేశారు. తన ఇంటికి వచ్చి బెదిరించిన ముగ్గురు వ్యక్తులను తాను ఐడెంటిఫై చేస్తానన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు కిషోర్ ఉన్నాడు అని చెప్పారు.

”సెప్టెంబర్ 30న పార్క్ హయత్ లో ఓ ఈవెంట్ లో బండ్ల గణేశ్ నన్ను కలిశాడు. అమౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తావు అని అడిగాను. నేను ఇవ్వాల్సింది రూ.1.7 కోట్లే కదా అన్నాడు. కాదు రూ.7 కోట్లు అని చెప్పాను. అన్నా నాతో పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ గెలవలేవు అన్నాడు. నాకు హోంమంత్రి సుచరిత, మంత్రి బొత్స తెలుసు అని బెదిరించాడు” అని పీవీపీ తెలిపారు. ప్రముఖుల పేర్లు చెబితే తాను భయపడను అని పీవీపీ తేల్చి చెప్పారు. ఇంటికి వచ్చి మరీ బెదిరించడాన్ని తాను సీరియస్ గా తీసుకున్నానని తెలిపారు.

కిడ్నాప్ చేయబోయారు అంటూ బండ్ల గణేశ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పీవీపీ అన్నారు. ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. తనకు రావాల్సిన రూ.7 కోట్లు వచ్చేంతవరకు పోరాడతానని తేల్చి చెప్పారు.