వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పై సస్పెన్షన్ వేటు పడింది.

  • Published By: veegamteam ,Published On : February 10, 2019 / 03:33 AM IST
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పై సస్పెన్షన్ వేటు పడింది.

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిభ్రవరి 9 శనివారం రోజు మధ్యాహ్నం సస్పెండ్‌ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టులో ఎన్నికల పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా వికారాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న జలీల్‌ ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన గదిని తెరిచి తనిఖీ నిర్వహించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఎన్నికల పిటిషన్‌ న్యాయస్థానంలో పెండింగ్ లో ఉండగా ఆ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన గది(స్ట్రాంగ్‌ రూమ్‌)ని తెరవకూడదు. అందులోని ఓటింగ్‌ వివరాలను తొలగించకూడదు.

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తొలిదశ తనిఖీ చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ను సీఈసీ ఆదేశించింది. ఆ మేరకు ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి న్యాయస్థానంలో వ్యాజ్యాలున్న నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఈవీఎంలను తొలిదశ తనిఖీ ప్రక్రియ నిర్వహించాల్సిందిగా స్పష్టం చేశారు. అందుకు విరుద్ధంగా వికారాబాద్‌లో తనిఖీ చేపట్టడం వివాదాస్పదమైంది. అనంతరం ఆయా వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వికారాబాద్‌ జిల్లా యంత్రాంగం ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో జిల్లా అధికారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించారు. కోర్టులో పిటిషన్ ఉండటంతో నియోజకవర్గాల వివరాలను బ్లాక్‌ చేసినట్లు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న రజత్‌కుమార్‌ వివరణ ఇవ్వాల్సిందిగా జలీల్‌ను ఆదేశించారు. న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్న విషయం తన దృష్టికి రాలేదని కలెక్టర్‌ వివరణ ఇచ్చారు. ఆయా నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.

ముందుగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈవీఎంలను భద్రపరిచిన గదిని తెరవడంతో కొన్ని ఈవీఎంల్లోని ఓటింగ్‌ సమాచారాన్ని తొలగించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేయడంతో పాటు క్రమశిక్షణ చర్య కింద భారీగా అపరాధ రుసుము విధించాలని స్పష్టం చేసింది. వారం రోజుల వ్యవధిలోగా ఛార్జిషీటును తమకు పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన అధికారులను ఇప్పటి వరకు సస్పెండ్‌ చేసిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా వికారాబాద్‌ జిల్లాలో పలువురు అధికారులపై వేటు పడటం చర్చనీయాంశంగా ఉంది. ఎన్నికల సమయంలో వికారాబాద్‌ ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. తాజాగా కలెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.