విమానంలో వస్తారు, ATM దోచేస్తారు, తిరిగి విమానంలోనే వెళ్తారు.. 34గంటల్లోనే లగ్జరీ దొంగలను పట్టుకున్న విశాఖ పోలీసులు

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 12:22 PM IST
విమానంలో వస్తారు, ATM దోచేస్తారు, తిరిగి విమానంలోనే వెళ్తారు.. 34గంటల్లోనే లగ్జరీ దొంగలను పట్టుకున్న విశాఖ పోలీసులు

luxury robbers: ఫ్లైట్‌లో వస్తారు.. ATMల చుట్టూ రెక్కీ చేస్తారు… అదును చోసి డబ్బంతా దోచేస్తారు.. ఎవ్వరికీ దొరక్కుండా తీరా ఫ్లైట్‌లోనే చెక్కేస్తారు… ఇదీ కొత్త రకం లగ్జరీ దొంగల చోరీ స్టైల్‌. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు దొంగలు ATMలలో చోరీలు చేస్తూ లగ్జరీగా బతుకుతున్నారు. దొంగతనం చేస్తూ ఎవ్వరికీ దొరక్కుండా కొత్త పంథాలో వెళ్తున్నారు. విశాఖలో వరుసగా
చోరీలు చేస్తూ ఖాకీల కన్నుకు చిక్కిందీ ముఠా.

సుందర్‌నగర్‌లో జరిగిన ATM చోరీ కేసును 34 గంటల్లోనే ఛేదించిన పోలీసులు:
విశాఖపట్నంలోని సుందర్‌నగర్‌లో జరిగిన ATM చోరీ కేసును 34 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. చోరీ చేసింది పాత నేరస్థులైన పంజాబ్‌కు చెందిన సమర్‌ జ్యోతి సింగ్‌, కేరళకు చెందిన జాఫర్‌
సాధిక్‌లుగా గుర్తించారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో వీరికి పరిచయం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పుడే చోరీలకు స్కెచ్‌ గీశారు ఇద్దరూ.

హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖకు వచ్చిన దొంగలు:
అక్టోబర్ 16న హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ వచ్చిన ఈ ఇద్దరు దొంగలు.. ఓ హోటల్‌లో దిగి .. బైక్‌ రెంటల్‌ షాపులో స్కూటీ అద్దెకు తీసుకున్నారు. దోపిడీకి అనువుగా ఉండే ATM కోసం నగరంలోని 50 కాలనీల్లో రెక్కీ చేశారు. సుందర్‌నగర్‌లో ఈజీగా చోరీ చేయొచ్చని గుర్తించారు. ATM మిషన్‌ కట్‌ చేయడానికి అవసరమైన గ్యాస్‌ కట్టర్‌, సిలిండర్‌, ఇతర వస్తువులను ATM ఎదురుగా ఉన్న పార్క్‌లో దాచారు.

ఏటీఎం నుంచి రూ.9లక్షలు చోరీ:
అక్టోబర్ 22న రాత్రి వారి ప్లాన్‌ను అమలు చేశారు. సమర జ్యోతి సింగ్‌ గ్యాస్‌ కట్టర్‌, ఇతర వస్తువులను తీసుకొని ATM లోపలికి వెళ్లి షటర్‌ మూసివేశాడు. సీసీ కెమెరాలను కూడా డిస్‌కనెక్ట్ చేసి..
ATM మిషన్‌ను కట్ చేసి అందులో ఉన్న 9 లక్షల 59 వేల 500 రూపాయలను చోరీ చేశాడు. సాదిక్ ATM బయటే ఉండి గమనించాడు. పని పూర్తయిన తర్వాత ఇద్దరూ హోటల్‌కు
చేరుకొని.. ఫ్లైట్‌లో సింపుల్‌ గా బెంగళూరు చెక్కేశారు.

టాటా కంపెనీ మెయింటైన్ చేస్తున్న ఏటీఎంలలో మాత్రమే చోరీ:
ఈ ATM చోరీ నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ATM చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. వీరి దగ్గరి నుంచి 6 లక్షలు రికవరీ చేశారు. పంజాబ్‌కు చెందిన జ్యోత్‌ సింగ్, కేరళకు చెందిన జాఫర్ సాధిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో హైదరాబాద్ లోని కూకట్ పల్లి, మాదాపూర్, బెంగుళూరులో 2 ATMలు దోచుకున్నట్లు గుర్తించారు. లగ్జరీగా బతకడం వీరిద్దరికీ ఇష్టమని అందుకే రిస్క్‌ లేకుండా ATMలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. కేవలం టాటా కంపెనీ మెయింటైన్ చేస్తున్న ఏటీఎంలలోనే దొంగతనం చేయడం ఈ కేసులో మరో ట్విస్ట్‌.