స్కూల్ ఫీజుల దోపిడీ: కేసు ఫైల్ చేసిన స్వఛ్చంద సంస్ధ

  • Published By: chvmurthy ,Published On : January 25, 2019 / 01:06 PM IST
స్కూల్ ఫీజుల దోపిడీ: కేసు ఫైల్ చేసిన స్వఛ్చంద సంస్ధ

తెలంగాణాలో ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై మరో ఉద్యమం ఆరంభం అయ్యింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే చట్ట పరంగా పోరాటానికి సిద్ధమంటోంది ఫోరం అగైనెస్ట్ కరప్షన్.  రాష్ట్రంలో ప్రయివేటు స్కూళ్లలో  ఫీజుల రెగ్యులేషన్ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. దీంతో  ప్రభుత్వం తిరుపతిరావు కమిటిని వేసింది. కమిటీ విచారణ జరిపి రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. కాని ఈ విద్యాసంవత్సరంలో కూడా రెగ్యులేషన్ చేసిన దాఖలాలు లేవు. తాజాగా ఫోరం అగైనెస్ట్ కరప్షన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఫీజుల దోపిడిపై కలెక్టరేట్లలో పిటిషన్లు దాఖలు చేసింది. 
త్వరలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం ఆరంభం కాబోతోంది. స్కూళ్లు స్టార్ట్ అయ్యాయంటే ఫీజుల దోపిడికి అడ్డు అదుపు ఉండదు. వివిధ రకాల పేర్లతో స్కూల్ యాజమాన్యాలు లక్షల్లో  విద్యార్ధుల తల్లితండ్రుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో ఫీజుల దోపిడీని అరికట్టలేకపోతున్నారు. అంతేకాదు అడ్మిషన్ల ప్రక్రియ కూడా వచ్చే యేడాదికి ఐదారు నెలల ముందే ముంగించేస్తున్నారు. దీంతో బడా,బడా స్కూల్స్ లో సీటు దొరకడం కూడా చాలా కష్టమవుతోంది. అయితే ఆఫీజులు, తల్లిదండ్రుల  తమ ఆస్తులు అమ్ముకునేలా వుంటున్నాయి. అందుకే ఫోరం అగైనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ఉమ్మడి హైద్రాబాద్ జిల్లాలోని స్కూల్స్ పైన దృష్టి సారించింది.
హైదరాబాద్ లో కార్పోరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నారని సంస్ధ ఆరోపిస్తోంది. అందులోనూ చాలా పేరున్న స్కూల్స్ గా చెప్పుకుంటున్న స్కూల్స్ కి కూడా కనీసం గుర్తింపు లేదని సంస్ధ కన్వీనర్ విజయ్ గోపాల్ చెప్పారు. ఫీజులు ఎక్కువ ఉన్నాయని తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫీజులు తగ్గించే ఉద్దేశంలో ఏ స్కూల్ యాజమాన్యం లేదని ఆయన తెలిపారు. విద్యాహక్కు చట్టంలో వున్న హక్కుల్ని ప్రైవేటు యాజమాన్యాలు కాలరాస్తున్నాయని, అందుకే ముందు పోరాటం చేయాల్సింది  రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయించడం కోసం ఉద్యమం  చేస్తున్నామని ఆయన  చెప్పారు. 
హైద్రాబాద్ లో దాదాపుగా 15 పెద్ద స్కూల్స్ విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఈ సంస్థ తేల్చింది. రంగారెడ్డి జిల్లాలో 10 స్కూల్స్, మేడ్చల్ లో మరో 11 స్కూల్స్ నిబంధనలను అతిక్రమించి ఫీజులు వసూలు చేస్తున్నాయని మూడు కలెక్టరేట్లలో పిటీషన్లు దాఖలు చేసారు. అంతేకాదు ఈ 36 స్కూల్స్ లో దాదాపుగా 10 స్కూల్స్ కి కనీసం గుర్తింపు కూడా లేకుండా యదేచ్ఛగా నడుపుతున్నా, డీఈఓలు కానీ విద్యాశాఖ డైరెకర్లు కానీ ఏమి చెయ్యలేకపోతున్నారని ఎన్జీఓ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందిగా అమలు చేస్తే ఇటువంటి సమస్యలు పునరావృత్తం కావని ఆదిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ పిటీషన్ కి మూడు కలెక్టరేట్లూ స్పందిచకపోతే ఏకంగా సంబంధిత డిఈఓలపైన, రాష్ట్ర విద్యాశాఖాధికారులపైన కూడా కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఇదే విషయమై హైకోర్టు, సుప్రింకోర్టు కి వెళ్లేందుకు కూడా వెనకాడమని ఎన్జీఓ స్పష్టం చేస్తోంది.