Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుంది.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

Telangana Government Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొలువుల భర్తీ జాతర కొనసాగుతోంది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 60వేల ఖాళీల భర్తీకి విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. తాజాగా మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60వేల 929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ గుర్తు చేశారు. తాజాగా మరో 16వేల 940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డితో కలసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్.. ఉద్యోగుల నియామక ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతో పాటు, రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తుందని తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.