కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన చైనా శతాధిక వృద్ధుడు…లక్ష దాటిన కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2020 / 03:34 PM IST
కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన చైనా శతాధిక వృద్ధుడు…లక్ష దాటిన కరోనా కేసులు

వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్‌ బారిన పడిందీ మరెక్కడో కాదు, మొదటగా వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్‌ నగరంలోనే.

ఆ శతాధిక వృద్ధుడి సర్‌ నేమ్‌ ను దాయ్‌గా ఆయన ట్రీట్మెంట్ పొందిన హాస్పిటల్ ఇంచార్జి లీ లాయ్‌ తెలిపారు. దాయ్‌ విడుదలైనప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని లీ లాయ్‌ చెప్పారు. ఆయన తన 101వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే హాస్పిటల్ పాలయ్యారు.ఇంటి వద్ద తన 92 ఏళ్ల భార్య నిరీక్షిస్తుందని, తాను త్వరగా ఇంటకి వెళ్లి ఆమె బాగాగులు చూసుకోవాలని చెబుతుండేవారని డాక్టర్‌ తెలిపారు.

అంతకుముందు ఆదివారం 98 ఏళ్ల హు హానియింగ్‌ కూడా కరోనా వైరస్‌ ను జయించి హాస్పిటల్  నుంచి బయటకు వచ్చారు. ఆయనతోపాటు హు హానియింగ్‌ 54 ఏళ్ల కూతురు కూడా సురక్షితంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఫిబ్రవరి 13న వారిద్దరి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉండిందని, అయినా వారిద్దరు చావును జయించి బయటకు వచ్చారని డాక్టర్లు తెలిపారు. ఆ వృద్ధుడికి వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.

చైనాలో ఇప్పటి వరకు 80వేల మందికి పైగా కరోనా వైరస్ బారినపడగా 3వేల 200 ప్రాణాలు కోల్పోయారు. గత రెండు, మూడు రోజులుగా చైనాలో కొత్త వైరస్‌ కేసులు గణనీయంగా తగ్గాయని చైనా వైద్యాధికారులు తెలిపారు. అంతేకాకుండా చాలామంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది.