UN Reportలో సంచలన విషయాలు.. మారుతున్న వాతావరణం.. మానవాళికి రెడ్ అలర్ట్

భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ అన్‌ క్లైమెట్‌ చేంజ్‌ (IPCC) తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

UN Reportలో సంచలన విషయాలు.. మారుతున్న వాతావరణం.. మానవాళికి రెడ్ అలర్ట్

Himalayas

UN Report  భూతాపం కారణంగా 2030నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పెరిగే ప్రమాదమున్నదని వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించే ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ అన్‌ క్లైమెట్‌ చేంజ్‌ (IPCC) తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఇప్పటికిప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఈ గరిష్ఠ స్థాయిని చేరుకోవడం మాత్రం ఖాయమని, దీనికి కారణం కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి ఆ స్థాయిలో ఇప్పటికే విడుదలయ్యాయని నివేదిక తెలిపింది. క్లైమెట్ చేంజ్(వాతావరణ మార్పు)2021 పేరుతో ఐపీసీసీ విడుదల చేసిన తన ఆరవ అంచనా రిపోర్ట్(AR6)లో..గతంలో ప్రతి వందేండ్లకు ఒక్కసారి చొప్పున పెరిగే సముద్రమట్టాలు ఇకపై ఏటా పెరగొచ్చని హెచ్చరించింది.

వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని.. వరదలు, కార్చిచ్చులు, వడగాడ్పులు,హిమాలయాల్లోని మంచు కరుగడం, సముద్ర మట్టాలు పెరుగడం ఇలా ఎన్నో ఉపద్రవాలు ముంచుకురావచ్చని తెలిపింది. భూతాపం కారణంగా వేసవిలో ఆర్కిటిక్‌ వలయంలోని మంచు కరిగి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయని తెలిపింది. గతంలో వడగాడ్పుల ప్రభావం ప్రతి 50 ఏండ్లకు ఒకసారి మాత్రమే కనిపించేదని… ఇకపై ప్రతి పదేళ్లకు అవి బీభత్సం సృష్టించనున్నట్లు రిపోర్ట్ తెలిపింది. వడగాడ్పులే ప్రస్తుతం కాలిఫోర్నియా, గ్రీస్‌, టర్కీల్లో కార్చిచ్చులకు ఆజ్యం పోసినట్లు తెలిపింది.

ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీల సెల్సియస్‌ పెరుగొచ్చని రిపోర్ట్ అంచనా వేసింది. కార్బన్‌డైఆక్సైడ్‌, గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను కట్టడి చేయకపోతే వడగాడ్పులు, కరువుకాటకాలు, కుండపోత వర్షాలు భూగ్రహాన్ని అతలాకుతలం చేస్తాయని తెలిపింది. గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను తగ్గిస్తే పర్యావరణంలో కలుగుతున్న మార్పులను తగ్గించడమే కాకుండా వాయుకాలుష్యాన్ని కూడా నియంత్రించగలమని పేర్కొంది.

అయితే పర్యావరణంలో జరుగుతున్న ఈ అనూహ్య మార్పులకు ముమ్మాటికీ మానవుడిదే తప్పిదమని రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ భూమిపై మానవసమాజం అంత క్షేమకర పరిస్థితుల్లో లేదని రిపోర్ట్ తెలిపింది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న చర్యలను ఇప్పటికిప్పుడు నిలిపివేయకపోతే, జీవుజాతులు అంతరిస్తాయని… ప్రకృతే కనుమరుగు అవుతుందని తెలిపింది.

ఇక,మిగతా సముద్రాలతో పోలిస్తే హిందూ మహా సముద్ర జలాలు వేగంగా వేడెక్కుతున్నాయని నివేదిక పేర్కొంది. దీంతో భారత్‌ పై వడగాడ్పులు, వరదలు విరుచుకుపడే ప్రమాదముందని తెలిపింది. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంతాలు ముంపుకు గురవ్వొచ్చని, అతివృష్టి, అనావృష్టి రెండూ తాండవించవచ్చని హెచ్చరించింది. అయితే, వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల హెచ్చరికలను దేశాధినేతలు పట్టించుకోలేదని… జరుగబోనున్న ఉత్పాతాలను ఇష్టంలేకపోయిన అంగీకరించాల్సిందనని.. ఇది మానవాళికి రెడ్‌ అలర్ట్‌ అని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ పేర్కొన్నారు.

IPCC ఏంటీ.. క్లైమాట్ రిపోర్ట్ ఎలా రూపొందిస్తారు

యునైటెడ్ నేష‌న్స్‌కు చెందిన వ‌ర‌ల్డ్ మెటిరోలాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (WMO), ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP)లు సంయుక్తంగా 1988లో ఐపీసీసీని ఏర్పాటు చేశాయి. వాతావ‌ర‌ణ మార్పుల్లో ఉన్న శాస్త్రీయ‌త‌ను అధ్య‌య‌నం చేసేందుకు ఈ ప్యానెల్‌ను నియ‌మించారు. ఈ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం జెనీవాలో ఉన్న‌ది. ప్ర‌స్తుతం ద‌క్షిణ కొరియాకు చెందిన హీసంగ్ లీ దానికి బాధ్య‌త‌లు వ‌హిస్తున్నారు.

గ్లోబ‌ల్ వార్మింగ్‌పై త‌ట‌స్థ ప‌ద్ధ‌తిలో, సైన్స్ ఆధారిత అప్‌డేట్స్‌ను ఐపీసీసీ ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తెలియ‌జేస్తుంది. వాతావ‌ర‌ణ మార్పుల్లో ఉండే స‌మ‌స్య‌లు.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఐపీసీసీ త‌న రిపోర్ట్‌లో చెబుతుంది. ఈ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. ప్ర‌భుత్వాలు త‌మ అభివృద్ధి ప్రణాళిక‌ల‌ను రూపొందిస్తుంటాయి. ఐపీసీసీ త‌న నివేదిక కోసం కొత్త‌గా ఎటువంటి అధ్య‌య‌నాలు చేప‌ట్ట‌దు. కానీ ప‌బ్లిష్ అయిన వేలాది అధ్య‌య‌నాల‌ను, శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్న వాటిని క్రోడీక‌రిస్తుంది. అన్ని అధ్య‌య‌నాల‌ను స‌మీక్షించిన త‌న నివేదిక‌ను ఐపీసీసీ రూపొందిస్తుంది. ప్ర‌తి ఆరేళ్ల‌కు ఒక‌సారి రిపోర్ట్ ను త‌యారు చేస్తారు. 1990లో తొలిసారి నివేదిక ఇచ్చారు. 2014లో చివ‌రిసారి రిపోర్ట్ స‌మ‌ర్పించారు. వాతార‌ణ మార్పుల‌పై మూడు బృందాలు నివేదిక‌ల‌ను రూపొందిస్తాయి. ఒక్కొక్క గ్రూపుకు చెందిన రిపోర్ట్‌ను వేర్వేరుగా ప‌బ్లిష్ చేస్తారు. ఆ త‌ర్వాత చివ‌ర‌కు మూడింటిని క‌లిపి ఫైన‌ల్ నివేదిక రిలీజ్ చేస్తారు. ఫ‌స్ట్ వ‌ర్కింగ్ గ్రూపుకు చెందిన నివేదిక‌ను ఆగ‌స్టు 9న రిలీజ్ చేశారు. ఇక రెండ‌వ గ్రూపు రిపోర్ట్‌ను ఫిబ్ర‌వ‌రి 2022న రిలీజ్ చేస్తారు. ఇక మూడ‌వ గ్రూపు నివేదిక‌ను మార్చి 2022లో రిలీజ్ చేస్తారు. ఫైన‌ల్ రిపోర్ట్ కూడా వ‌చ్చే ఏడాది విడుదల చేస్తారు. కాగా,2014లో ఐపీసీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం కుదిరింది.