Haiti President : హైతీ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్య

హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్యకు గురయ్యారు.

Haiti President : హైతీ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్య

Haiti

Haiti President హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్యకు గురయ్యారు. తన ప్రైవేట్ నివాసంలో ఉన్న మోసెను మంగళవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని సాయుధ వ్యక్తుల బృందం హత్య చేసినట్లు తాత్కాలిక ప్రధాన మంత్రి క్లాడ్ జోసెఫ్ ఓ ప్రకటనలో ప్రకటించారు. ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాట్లాడే విదేశీయులు అధ్యక్షుడిని తన ఇంటి వద్ద హత్య చేశారని జోసెఫ్ చెప్పారు. ఇక,దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అధ్యక్షుడి సతీమణి మార్టిన్ మోసెని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని క్లాడ్ జోసెఫ్ తెలిపారు.

దేశాధ్యక్షుడి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ప్రధాని క్లాడ్ జోసెఫ్..ఇది ద్వేషపూరిత, అమానవీయ మరియు అనాగరిక చర్యగా అభివర్ణించారు. రాజకీయ మరియు ఆర్ధిక అస్థిరత్వం సృష్టించడం కోసం ఇలాంటి దారుణగాలకు ఒడిగట్టడం సహించరానిదని.. హైతీ యొక్క జాతీయ పోలీసులు మరియు ఇతర అధికారులు కరేబియన్ దేశంలో పరిస్థితిని అదుపులో ఉంచారని ప్రధాని తెలిపారు. హైతీ అధ్యక్షుడి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, 2016లో నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసె గెలిచారు. 2017 ఫిబ్రవరిలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, హైతీ అధ్యక్షుని పదవీ కాలం 2016లో ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. హైతీ సుపీరియర్ కౌన్సిల్ కూడా విపక్షాల వాదనను అంగీకరించింది. దీంతో మోసె రాజీనామా చేయాలని కొద్ది రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాజీనామా చేసేందుకు మోసె నిరాకరించారు. తన పదవీకాలం 2017లో తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుందని,2022 ఫిబ్రవరి వరకు తన పదవీకాలం ఉందని మోసే వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మోసె హత్య హైతీ రాజకీయాల్లో కలకలం రేపింది.

మరోవైపు, ఇప్పటికే హైతీలో గ్యాంగ్ వయొలెన్స్, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. రాజకీయ, ఆర్ధిక అస్థిరత కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆహార కొరత తీవ్రంగా ఉంది. పైగా 2010 లో వచ్చిన పెను భూకంపం, 2016 లో తుపాను వల్ల హైతీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ నష్టాల బారి నుంచి బయట పడలేకపోతోంది.