Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

ఉత్తరకొరియాలో మూడంటే మూడురోజుల్లో 8లక్షల20వేల 620 కేసులు నమోదయ్యాయంటే కిమ్ రాజ్యంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తిచెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.

Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

Omicron Wreaks Havoc In North Korea

Omicron wreaks havoc in North Korea : కరోనాను మహమ్మారి అని ఎందుకంటారో ప్రపంచానికి మరోసారి అర్ధమయింది. కరోనాను ఏ శక్తీ అడ్డుకోలేదని తేలిపోయింది. ఎన్ని కఠిన ఆంక్షలు అవలంబించినా…ఎంత పకడ్బందీగా వ్యవహరించినా…వైరస్‌ ప్రవేశాన్ని, వ్యాప్తిని అరికట్టలేమని స్పష్టమైపోయింది. మిగిలిన ప్రపంచమంతా కరోనా తీవ్రతతో అల్లాడుతున్న వేళ…ఒక్క కేసయినా లేకుండా హాయిగా జీవించిన ఉత్తరకొరియా ఇప్పుడు..వైరస్ వ్యాప్తితో అతలాకుతలమవుతోంది. ఉత్తరకొరియాలో కరోనా కేసులు, మరణాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. కొత్త సంక్షోభానికి దారితీస్తున్నాయి. మూడంటే మూడురోజుల్లో 8లక్షల20వేల 620 కేసులు నమోదయ్యాయంటే కిమ్ రాజ్యంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తిచెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.

రెండేళ్లగా ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతోంది. వూహాన్‌లో తొలికేసు నమోదయినదగ్గరనుంచి ఇప్పటిదాకా అనేక దేశాలు కరోనా ఉత్పాతాన్ని చవిచూశాయి. కోట్ల కేసులు, లక్షల మరణాలు, లాక్‌డౌన్‌లు, ఐసొలేషన్‌లతో యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఆర్థికవ్యవస్థలు కునారిల్లిపోయాయి. ఇప్పుడిప్పడే కరోనా కల్లోలం నుంచి ప్రపంచం కాస్తకాస్తగా కోలుకుంటోంది. అయినా వైరస్ పుట్టినిల్లయిన చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇంకా కరోనా తీవ్రత తగ్గలేదు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లను తప్పించుకున్న చైనా ఇప్పుడు ఒమిక్రాన్ కట్టడికి కనీవినీ ఎరుగని కఠిన ఆంక్షలు విధిస్తోంది. బీజింగ్, షాంఘై వంటి నగరాల ప్రజలు ఆంక్షలతో దుర్భర జీవితం గడుపుతున్నారు. కానీ ప్రపంచంలో ఇంత జరుగుతున్నా ఇప్పటిదాకా ఉత్తరకొరియాలో మాత్రం కరోనా కేసు అన్నమాటే వినిపించలేదు.

కేసుల సంఖ్య పెరగడం.. వైరస్ మరణాలు వంటివి ఆ దేశానికి తెలియదు. రెండేళ్లగా దేశంలో వైరస్ ప్రవేశించకుండా ఉండడానికి…అక్కడి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. సరిహద్దుల మూసివేత మొదలుకుని, దిగుమతుల నిలిపివేత దాకా చేపట్టని చర్యలేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఎలాగోలా అష్టకష్టాలు పడి…వైరస్ వ్యాప్తిచెందకుండా నిరోధించింది. ఉత్తరకొరియా తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ ఇప్పుడు అదే దేశం కరోనా ఉత్పాతానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది అతిపెద్ద సంక్షోభమని స్వయంగా దేశాధ్యక్షుడు ప్రకటించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.

నియంతృత్వానికి మారుపేరయని కిమ్ జోంగ్ ఉన్..చైనాలో వైరస్ వెలుగుచూసిన మరుక్షణం నుంచి జాగ్రత్త పడ్డారు. కఠినమైన లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించినవారిని కాల్చిచంపేందుకు సైతం వెనకాడలేదు. అంత కఠినచర్యలతో వైరస్‌ను అడ్డుకున్న ఉత్తరకొరియా ప్రభుత్వానికి ఇప్పుడేంచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వైరస్‌ను జయించిన దేశంగా గుర్తింపు పొందిన ఆ దేశం ఇప్పుడు కరోనా వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియక దిగాలుపడిపోతోంది. మూడంటే మూడోరోజుల్లో ఆ దేశంలో 8లక్షల20వేల620 కేసులు నమోదయ్యాయంటే అక్కడ వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్ధమవుతోంది. వైరస్ బారిన పడి 42 మంది చనిపోయారు. 3లక్షల 24వేల550 మంది చికిత్స పొందుతున్నారు.

ఉత్తరకొరియా అంతటా కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది. నగరాలు, ప్రావిన్సులు, కౌంటీలలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. వర్కింగ్ యూనిట్లు, ఉత్పత్తి యూనిట్లు, నివాసితప్రాంతాలన్నిటినీ లాక్‌డౌన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ క్వారెంటెయిన్ సిస్టమ్ అమలుచేస్తున్నారు. ఆరోగ్యకార్యకర్తలు రంగంలోకి దిగారు. వేగంగా వ్యాప్తిచెందే ఒమిక్రాన్‌ను రాజధాని ప్యాంగ్యాంగ్‌లో గుర్తించామని ఉత్తరకొరియా గురువారం (మే 12,2022 ప్రకటించింది. డు రోజుల్లో కేసుల సంఖ్య 8లక్షలు దాటిందంటే…ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ..అవేమీ ఫలితాన్నివ్వడం లేదన్న విషయం తేలిపోయింది. దీనికి కారణం భారీ ఎత్తున టెస్టులు నిర్వహించే సామర్థ్యం ఉత్తరకొరియాకు లేదు. ఆ దేశం దగ్గర టెస్టింగ్ కిట్లు ఎక్కువగా లేవు. దీంతో ఓ వ్యక్తికి కరోనా వచ్చిందని గుర్తించేలోపే అతి వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. అలాగే వ్యాక్సిన్లు కానీ, యాంటీ వైరల్ మందులు కానీ కొరియా దిగుమతి చేసుకోలేదు. కరోనా కాలంలో వ్యాక్సిన్లు, చికిత్స ఔషధాలు అనేక దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులు జరిగాయి. కానీ ఉత్తరకొరియా మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతులు నిలిపివేసింది. దీంతో ఆ దేశంలో ఇప్పుడు కరోనా చికిత్సకు అవసరమైన మందులు కానీ, వ్యాప్తిని అడ్డుకోగల వ్యాక్సిన్లు కానీ లేవు. WHO అంచనా ప్రకారం రెండేళ్ల కాలంలో ఆ దేశం నిర్వహించిన టెస్టుల సంఖ్య 64వేలు మాత్రమే. వ్యాక్సిన్లు, కిట్లు, కరోనా చికిత్స మందులు అందించడానికి గతంలోనే చైనా, ప్రపంచ ఆరోగ్యసంస్థ ముందుకొచ్చాయి. కానీ అప్పుడు ఉత్తరకొరియా అంగీకరించలేదు.

ప్రపంచంలో ఆరోగ్యవ్యవస్థ అధమంగా ఉండే దేశాల్లో ఉత్తరకొరియా ఒకటన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. కరోనా వేళ ఆ విషయం మరోసారి రుజువవుతోంది. వేలమంది కరోనా లక్షణాలతో బాధపడుతోంటే..వారానికి కేవలం 14వందలు మందికి మాత్రమే టెస్టులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం రెండేళ్లగా అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఇప్పటికే ఆ దేశం ఆహారసంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు పోషకాహారం అందండం లేదని ఐక్యరాజ్యసమితి ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. దీనికి ఇప్పుడు లాక్‌డౌన్‌లు, కరోనా ఉత్పాతం తోడయి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న కరోనా లెక్కలు చాలా తక్కువని..రానున్న రోజుల్లో ఉత్తరకొరియాను కరోనా ప్రళయం కమ్మేస్తుందని, కరోనా బాధితులకు వైద్యం అందక మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.