నేపాల్ మ్యాప్ లో భారత భూభాగం..నేపాల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు

  • Published By: venkaiahnaidu ,Published On : June 1, 2020 / 12:38 PM IST
నేపాల్ మ్యాప్ లో భారత భూభాగం..నేపాల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లు

చైనా అండతో భారత్‌ తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ మరింత రాజేస్తోంది. భారత భూభాగాలను తమ దేశంలోనివిగా చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నేపాల్ లో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(NCP) తీసుకొచ్చిన ఈ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌(NC) ప్రకటించిన ఒక్క రోజు తర్వాత అధికార పార్టీ మరింత అతిగా ప్రవర్థించింది. న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

భారత్‌ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను ఇటీవల నేపాల్‌ విడుదలచేసిన తెల్సిందే. అయితే ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే అక్కడి పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని సవరించాలి. దీంతో వేగం పెంచిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ బిల్లును తీసుకొచ్చేందుకు అక్కడి అధికార, ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపారు. అనంతరం రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చారు.

ఓ వైపు లఢఖ్ సరిహద్దుల్లో చైనా-భారత్ ల మధ్య ప్రతిష్ఠంభణ నెలకొన్న ఈ సమయంలో నేపాల్ ఈ బిల్లు తీసుకొచ్చింది. వాస్తవానికి గత వారమే నేపాల్ న్యాయ శాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. అయితే అప్పుడు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్(NC) ఈ బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తమకు కొంత సమయం కావాలని కోరడంతో షెడ్యూల్ నుంచి అప్పుడు ఆ బిల్లును తొలగించారు. సాధారణంగా భారత్ అనుకూలంగా ఉండే NC పార్టీ కూడా..ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని శనివారం తీర్మాణించింది.

సరిహద్దు వివాదం

మాన‌స స‌రోవ‌ర్ వెళ్లే యాత్రికుల సౌక‌ర్యార్థం ఉత్త‌రాఖండ్‌లోని నేపాల్ త‌మ‌దిగా చెప్పుకుంటున్న లిపులేఖ్ ప్రాంతంలో భార‌త్ ర‌హ‌దారిని నిర్మించింది. ఈ ర‌హ‌దారిని ఈ నెల 8న  భారత ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స‌మ‌యంలో భార‌త్‌పై నేపాల్ నిర‌స‌న తెలిపిందే. త‌మ భూభాగానికి చెందిన ప్రాంతాల్లో రోడ్డు వేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. ఆ దేశ రాజ‌ధానిలో కాఠ్‌మాండూలో కొంద‌రు భార‌త్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల‌కు కూడా దిగారు.

అయితే, ఇది పూర్తిగా త‌మ భూభాగ‌మేన‌ని, పైగా ఇది కొత్త దారి కాద‌ని, అనేక ఏళ్లుగా యాత్రికులు ఉప‌యోగిస్తున్న దారేన‌ని భార‌త్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత భార‌త్ భూభాగంలోని కాలాపాని, లింపియాధు‌ర‌, లిపులేఖ్ ప్రాంతాలను నేపాల్ దేశ భూభాగాలుగా చూపిస్తూ ఓ మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండ‌లి ఆమోదించింది. నేపాల్ గ‌త పాల‌కులు ఎవ‌రూ ఈ మూడు ప్రాంతాల గురించి మాట్లాడ‌లేద‌ని…ఇప్పుడు తాము భార‌త్ నుంచి ఈ ప్రాంతాల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌ని ఆ సమయంలో పాల్ ప్ర‌ధాన మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ ప్రకటించారు.

వ్యూహాత్మకంగా భారత్ కు కీలకం
1816లో అప్పుడు భార‌త్‌ను పాలించిన బ్రిటీష్ ప్ర‌భుత్వానికి – నేపాల్‌కు మ‌ధ్య జ‌రిగిన సుగౌలి ఒప్పందం ప్ర‌కారం ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌వేన‌ని ఆ దేశం అంటోంది. చాలా రోజులుగానే ఈ వాద‌న‌లు చేస్తున్నా గ‌త అక్టోబ‌రులో నేపాల్‌లో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ప‌ర్య‌టించిన త‌ర్వాత‌నే భార‌త్ – నేపాల్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మొద‌లైంది. దీంతో చైనానే నేపాల్‌ను పావుగా వాడుకుంటూ భార‌త్‌పై విమ‌ర్శ‌లు చేయిస్తుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా, వ్యూహాత్మ‌కంగా ఈ ప్రాంతాలు భార‌త్‌కు చాలా కీల‌కం. 1962 చైనాతో యుద్ధ జ‌రిగిన నాటి నుంచి భార‌త్ ఈ ప్రాంతాల్లో సైనిక స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసి స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. మ‌రీ ముఖ్యంగా కాలాపానీలో ఉండే ప‌ర్వ‌త‌శ్రేణులు భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌కు కీల‌కం. ఇక్క‌డ‌కు అతి స‌మీపంలో చైనాకు చెందిన బురాంగ్ సైనిక స్థావ‌రం ఉంది. కాలాపానీ మ‌న ఆధీనంలో లేక‌పోతే భార‌త్‌లోకి ఇక్క‌డి నుంచి చైనా ప్ర‌వేశించ‌డానికి అవకాశం ఉంటుంది. అందుకే భార‌త్ కూడా ఈ ప్రాంతాన్నీ కీల‌కంగా తీసుకుంది.