Amazon founder Jeff Bezos : కార్లు,టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం

కార్లు,టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం

Amazon founder Jeff Bezos : కార్లు,టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం

Amazon founder Jeff Bezos says save money

Amazon founder Jeff Bezos says save money : డబ్బులు ఊరికే రావు.. ఈ విషయం ఇప్పుడు మన మైండ్‌లోకి బాగానే ఎక్కేసింది. కానీ.. ఇప్పుడు మరో మాట వినిపిస్తోంది. అదే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకండి.. వీలైనంత వరకు సంపాదించింది దాచుకోండి. అనవసరమైనవి కొనకండి, షాపింగ్‌లు తగ్గించుకోండి అని.. ఏ ఆర్థిక నిపుణుడో చెబితే ఫరవాలేదు. కానీ.. ఇవే మాటలు ప్రపంచ కుబేరుడు.. ఆన్‌లైన్‌లోనే అన్నీ అమ్మేసే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ చెబితే.. కచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. ఉన్నట్టుండి ఆయన ఎందుకిలా చెప్పారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిజంగానే క్షీణిస్తోందా? రాబోయే కొద్ది నెలల్లో ఏం జరగబోతోంది?

పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఎప్పుడెలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. ఉదయం ఉద్యోగానికి వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చాక.. ఆ జాబ్ ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి. ఉదయాన్నే ఆఫీసుకు వెళదామని బయల్దేరే టైమ్‌కి.. ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లు మెయిల్ కూడా రావొచ్చు. లేకపోతే.. కాల్ చేసి.. మీ సేవలిక చాలు.. త్వరలోనే సెటిల్ చేసేస్తామని కూడా చెప్పొచ్చు. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులే కారణం. అవసరం లేని వాటికి కూడా ఆఫర్లు ఇచ్చి అమ్మేసే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ లాంటి వాడే.. డబ్బులు ఖర్చు చేయొద్దు. వీలైనంత దాచుకోండి అని చెబుతున్నాడంటే.. రాబోయే కొద్ది నెలల్లో ఆర్థిక పరిస్థితులు ఎంతకు దిగజారే ప్రమాదముందో ఇట్టే ఊహించేయొచ్చు.

Recession Effect : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఏయే రంగాలపై ప్రభావం పడుతుంది? సామాన్యులకూ ఇబ్బందులు తప్పవా? భారత్‌లో పరిస్థితులేంటీ?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తోందని.. ఇలాంటి సమయంలో కార్లు, పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్‌లు కొనొద్దని జెఫ్ బెజోస్ చెబుతున్నాడు. క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్‌లో.. డబ్బు ఖర్చు చేసుకోకుండా.. దాచుకోవాలని అమెరికన్లకు సూచించాడు. ఏదైనా.. భారీ ఎత్తున కొనుగోలు చేయాలనుకుంటే.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలంటున్నడాు. అంతేకాదు.. చిన్న తరహా వ్యాపారులు కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా.. డబ్బును పొదుపు చేసుకోవాలని సూచించాడు. రిస్క్ చేసి కొనుగోళ్లు చేస్తే.. తర్వాత ఆర్థిక మాంద్యం దశలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు జెఫ్ బెజోస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని.. మాంద్యం ముప్పు ముంచుకొస్తుందని.. అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు.. ప్రజలు నగదుని తమ దగ్గరే ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా కనిపించడం లేదు. దీని ప్రభావం.. అనేక రంగాలపై కనిపిస్తోంది. కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు కూడా ఇదే కారణంగా చెబుతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ.. జెఫ్ బెజోస్ సూచనలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. షాపింగ్‌ల జోలికి వెళ్లకుండా.. డబ్బు పొదుపు చేసుకోవాలని.. నగదును తమ దగ్గరే ఉంచుకోవాలని చెప్పాడంటే.. కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. రాబోయే పరిస్థితులపై కచ్చితమైన అవగాహన ఉంటుంది కాబట్టే.. బెజోస్ అలా చెప్పారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయ్. ఆర్థికమాంద్యం వచ్చే పరిస్థితులు.. ముందుగా తెలిసేది కూడా జెఫ్ బెజోస్ లాంటి వాళ్లకే. అందువల్ల.. అమెరికన్లు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల ప్రజలంతా డబ్బులను పొదుపు చేసుకుంటేనే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండదు. అలా కాకుండా.. గొప్పలకు పోయి అవసరం లేనివన్నీ కొనేస్తే.. ఈఎంఐలు కట్టుకోలేక కష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంది.

IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

ఇప్పటికే.. కోవిడ్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. దీనికి తోడు రష్యా-యుక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా భారీగా కనిపిస్తోంది. కోరలు చాస్తున్న ఆర్థిక మాంద్యానికి తోడు యుద్ధం, కొన్ని దేశాల్లో విపరీత వాతావరణ పరిస్థితులతో.. దిగ్గజ కంపెనీలు కూడా కుదేలైపోయాయ్. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఆ కంపెనీలో.. అంత మందిని తీసేశారు. ఈ కంపెనీలో.. ఇన్ని ఉద్యోగాలు తొలగించారనే వార్తలు కూడా ఇందులో భాగమే. అంతెందుకు.. అమెరికాను కమ్మేస్తున్న ఆర్థికమాంద్యం దెబ్బను తట్టుకునేందుకు.. ఆ దేశ రిజర్వ్ బ్యాంకే రంగంలోకి దిగింది. చివరకు బ్యాంకులకు ఇచ్చే రుణాలపై.. ఫెడరల్ ఫండ్ రేట్‌గా పిలిచే వడ్డీ రేటును పెంచేసింది. సహజంగానే బ్యాంకులన్నీ ఆ భారాన్ని వినియోగదారులపై వేసేశాయ్. వ్యక్తులకు, కంపెనీలకు ఇచ్చిన, ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచేశాయ్. ఈ భారాన్ని తట్టుకునేందుకు.. మెటా, సీగేట్, మైక్రోసాఫ్ట్ లాంటి కార్పొరేట్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించాయ్. కాస్ట్ కటింగ్‌లో వాటికి తోచిన తొలి ఆలోచన.. ఉద్యోగుల తొలగింపు. ఈ క్రమంలోనే.. సంస్థలో 13 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని మెటా భావించింది. ఈ ఒక్క నిర్ణయంతో.. 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ 11 వేల మందిలో దాదాపు వెయ్యి మంది భారతీయులే ఉన్నారు. ఇందులో దాదాపు 4 వందల మంది భారత్‌లో పనిచేసేవాళ్లున్నారు.

ఇక.. హార్డ్ డిస్క్‌లను తయారుచేసే సీగేట్ టెక్నాలజీస్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో.. 8 శాతం మంది అంటే దాదాపు 3 వేల మందిని తొలగించే ఆలోచనలో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా కాస్ట్ కటింగ్ పేరిట 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవడమే కాదు.. కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్రక్రియను కూడా కొన్నాళ్ల పాటు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్‌ తొలగించనున్న ఉద్యోగుల్లో.. ఎక్కువ శాతం భారతీయులే ఉండనున్నట్టు తెలుస్తోంది. వాల్ట్‌డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలు కూడా ఉద్యోగాల కోత మొదలుపెట్టేశాయ్. ఆ కంపెనీల వీసాలపై.. అమెరికాకు, ఇతర దేశాలకు వెళ్లిన ఇండియన్స్.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కంపెనీ ద్వారా హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేవారిని కంపెనీ తొలగిస్తే.. వాళ్లు 2 నెలల్లోగా మరో సంస్థలో ఉద్యోగం చూసుకోవాలి. లేకపోతే.. స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. దిగ్గజ కంపెనీలన్నీ.. వరుసగా ఉద్యోగాలు తీసేస్తుండటం వల్ల.. ఎక్కువగా నష్టపోతున్నది భారతీయులేనన్న అంచనాలున్నాయ్.

IMF Warns About Recession : ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏ క్షణమైనా కుదేలవుతాయని హెచ్చరిస్తున్న IMF

ఈ ఉద్యోగాల కోత విషయంలో.. ట్విట్టర్ చాలా డిఫరెంట్. ఎలాన్ మస్క్ ఆ కంపెనీని కొనే టైమ్‌కే.. అది నష్టాల్లో ఉంది. దీనికితోడు.. ట్విట్టర్‌ని కొనేందుకు బ్యాంకుల నుంచి మస్క్ తెచ్చిన అప్పులకు.. వడ్డీల భారం పెరిగిపోవడంతో.. మస్క్ ఉద్యోగుల తొలగింపు ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా.. 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను తీసేశారు. దీంతో.. 3700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో.. భారతీయులు కూడా ఉన్నారు. అంతేకాదు.. ట్విట్టర్ సంస్థకు భారత్‌లో ఉన్న మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్లను కూడా పూర్తిగా తొలగించారు. ఈ రెండు విభాగాల్లో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో.. 180 మందిని తీసేశారు. మిగతావారిని.. వేరే డిపార్ట్‌మెంట్లలోకి మార్చారు. అలాగే.. ట్విట్టర్ తన 5500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 4400 మందిని తొలగించేసింది. ఈ పరిణామాల వల్ల ఎక్కువగా నష్టపోయింది భారతీయులే. అది చాలదన్నట్లు ఎక్కువ గంటలు పనిచేయడానికి ఒప్పుకోవాలంటూ డెడ్‌లైన్ పెట్టడంతో మరో 1250 మంది రిజైన్ చేసేశారు. మిగిలిన వారిలోనూ కొంతమందిని మస్క్ పంపించేస్తాడన్న ప్రచారం జోరుగానే జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా.. ఉద్యోగాల్లో కోత పెడుతున్నవన్నీ ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలే. ఇండియాకు చెందిన సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో కోతలు తక్కువే ఉన్నాయ్. ప్రొడక్షన్ బేస్డ్ సేవలందించే అమెరికన్ కంపెనీల్లో.. టాప్ ఫైవ్ ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్. అలాగే.. భారత్ నుంచి సేవలందించే సర్వీస్‌ బేస్డ్‌ కంపెనీలు.. విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌. వీటిలో కాగ్నిజెంట్‌ ఒక్కటే.. అమెరికన్‌ మల్టీనేషనల్ కంపెనీ. అందుకే.. ఈ ఒక్క సంస్థలోనే ఈ మధ్యకాలంలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ సరిగా లేదని, ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందారని.. భారత్‌లో 12 వేల మంది ఉద్యోగులను తీసేశారు. ఇలా ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ట్విట్టర్‌ లాంటి కంపెనీల్లో పనిచేస్తూ.. ఉద్వాసనకు గురైనవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాళ్ల నుంచి భారతదేశానికి వచ్చే రెమిషన్స్ తగ్గడంతో.. ఇక్కడున్న వారి కుటుంబాలపైన, ఖర్చుల సామర్థ్యంపైనా.. పరోక్షంగా.. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతోంది.