Dmitry Peskov : ఆ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే.. ఈ క్షణమే దాడులు ఆపేస్తాం-రష్యా

యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని Dmitry Peskov అన్నారు. క్రిమియాను రష్యా భూభాగంగా గుర్తించాలన్నారు. ఈ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే..

Dmitry Peskov : ఆ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే.. ఈ క్షణమే దాడులు ఆపేస్తాం-రష్యా

Dmitry Peskov

Dmitry Peskov : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. 12 రోజులుగా యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా బలగాలు. యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రష్యా మాత్రం తగ్గేదేలే అంటోంది. యుక్రెయిన్ పై బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

ఇది ఇలా ఉంటే.. రష్యా అధినాయకత్వం నుంచి ఆసక్తికరమైన ప్రతిపాదన వచ్చింది. తమ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే ఈ క్షణమే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ (Dmitry Peskov) వెల్లడించారు. యుక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని, అది యుక్రెయిన్ ఏ కూటమిలోనైనా చేరడాన్ని నిరోధించేలా ఉండాలని పెస్కోవ్ స్పష్టం చేశారు. అంతేకాదు క్రిమియాను రష్యా భూభాగంగా గుర్తించాలి. వేర్పాటువాద రిపబ్లిక్‌లైన దొనేత్సక్, లుగాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలి. ఈ షరతులకు యుక్రెయిన్ అంగీకరిస్తే తాము చేపడుతున్న సైనిక చర్యను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తామని చెప్పారు.

Modi Putin : జెలెన్‌స్కీతో మీరే నేరుగా మాట్లాడి వివాదాన్ని ముగించండి- పుతిన్‌ను కోరిన మోదీ

రష్యా-యుక్రెయిన్ మధ్య మూడో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా తాజా ప్రతిపాదన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై యుక్రెయిన్ తన స్పందనను చర్చల సందర్భంగా వెల్లడించే అవకాశముంది.

కాగా, యుక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాల జాబితాను రష్యా రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్, ఈయూ దేశాలు, జపాన్ ఉన్నాయి. ఈ జాబితాకు రష్యా అధ్యక్ష కార్యాలయం ఆమోద ముద్ర వేసింది.

Russia Ukraine War : శాంతి యుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి- జెలెన్‌స్కీ కి సూచించిన ప్రధాని మోదీ

యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్య యావత్ ప్రపంచాన్ని ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. అయితే రష్యా శక్తిసామర్థ్యాల దృష్ట్యా అమెరికా తదితర నాటో దేశాలు, ఈయూ దేశాలు నేరుగా సైనిక చర్యకు దిగకుండా, ఆర్థిక ఆంక్షలతో రష్యాను బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నాయి. అయినా రష్యా డోంట్ కేర్ అంటోంది. యుక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తోంది.

కాగా.. రష్యా సేనల దాడులను యుక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. శత్రుదేశ బలగాలు దేశాన్ని ఆక్రమించుకోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యా సైనికులు హస్తగతం చేసుకున్న ఓ నగరాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నట్లు యుక్రెయిన్‌ సాయుధ బలగాలు వెల్లడించాయి. ‘‘ఖార్కివ్‌ ప్రాంతంలోని చుహివ్‌ నగరానికి శత్రువుల నుంచి విముక్తి లభించింది. ఆక్రమణదారులు భారీ మొత్తంలో ఆయుధాలు, సైనికులను కోల్పోయారు’’ అని యుక్రెయిన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ జనరల్‌ స్టాఫ్‌ వెల్లడించింది.

మరోవైపు యుద్ధంలో రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోతోందని యుక్రెయిన్‌ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించింది. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి మిలిటరీ కమాండర్లు యుద్ధంలో చనిపోయినట్లు యుక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. రష్యా సాయుధ బలగాల్లోని 61వ సపరేట్‌ మెరైన్ బ్రిగేడ్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ దిమిత్రీ సఫ్రనోవ్‌, 11వ సపరేట్‌ ఎయిర్‌బోర్న్‌ అసల్ట్‌ బ్రిగేడ్‌ డిప్యూటీ కమాండర్‌ లెఫ్టినెంట్ కల్నల్ డెనిస్‌ గ్లిబోవ్‌ మరణించినట్లు వెల్లడించింది.