Donald Trump : తాలిబన్ కు ఉన్న హక్కు నాకు లేదా..కోర్టుకెక్కిన ట్రంప్

త‌న ట్విట‌ర్ అకౌంట్ పున‌రుద్ధ‌రించాలంటూ అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుని ఆశ్రయించారు.

Donald Trump : తాలిబన్ కు ఉన్న హక్కు నాకు లేదా..కోర్టుకెక్కిన ట్రంప్

Trump

Donald Trump త‌న ట్విట‌ర్ అకౌంట్ పున‌రుద్ధ‌రించాలంటూ అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుని ఆశ్రయించారు. జ‌న‌వ‌రి-6,2021న యూఎస్ కాపిట‌ల్‌పై ట్రంప్ అభిమానుల దాడి త‌ర్వాత ఆయ‌న అకౌంట్‌ను ట్విట‌ర్ స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అధ్యక్ష ఎన్నిక‌ల్లో బైడెన్ అక్ర‌మంగా విజ‌యం సాధించారంటూ కాపిట‌ల్ హిల్‌పై ట్రంప్ అభిమానులు దాడి చేయడం..ట్రంప్ రెచ్చగొట్టే ట్వీట్లు చేసిన నేపథ్యంలో ఆయన అకౌంట్ ను ట్విట్టర్ శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఆయ‌న భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి హింస‌ను ప్రేరేపిస్తారంటూ ట్విట‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. బ్యాన్ సమయంలో ట్విట్టర్ ​లో ట్రంప్​కు 8.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అయితే ఈ స‌స్పెన్ష‌న్‌ను ఎత్తేయాల‌ని కోరుతూ ట్రంప్ లాయ‌ర్లు శుక్ర‌వారం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ట్విట‌ర్‌, ఆ సంస్థ సీఈవో జాక్ డోర్సీపై ప్రాథ‌మిక ఇంజంక్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వాలంటూ వాళ్లు కోరారు. ట్రంప్‌ ను అడ్డుకుంటూ ఆయ‌న‌ ఫ‌స్ట్ అమెండ్‌మెంట్ హ‌క్కుల‌ను ట్విట‌ర్ ఉల్లంఘిస్తోందంటూ ట్రంప్ త‌ర‌ఫు లాయ‌ర్లు వాదిస్తున్నారు. తాలిబన్లను కూడా రెగ్యులర్ గా ట్వీట్లు చేసేందుకు అనుమతించిన ట్విట్టర్..తన అకౌంట్ పై మాత్రం సెన్సార్ షిప్ విధించిందని తన ఫైలింగ్ లో ట్రంప్ వాదించారు.

ఫేస్​బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలపై జులైలోనే వ్యాజ్యం దాఖలు చేశారు ట్రంప్. ఈ సంస్థల సీఈఓల స్థాయి ప్రభుత్వ వ్యక్తుల స్థాయికి మారిపోయిందని ఆరోపించారు. దేశంలో రాజకీయ ప్రసంగాలను ట్విట్టర్ నియంత్రిస్తోందని ట్రంప్ ఆరోపించారు. యూజర్లపై సెన్సార్​షిప్ విధిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ఖాతాపై విధించింది సెన్సార్​షిప్ కాదని ఫేస్​బుక్, ట్విట్టర్ చెప్తున్నాయి. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసాకాండను దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమం మేరకే ట్రంప్ అకౌంట్స్ నిలిపివేసినట్లు ఫేస్​బుక్, ట్విట్టర్ తెలిపాయి.

ALSO READ చై-సామ్ విడాకుల గురించి ముందే చెప్పిన జ్యోతిష్కుడు.. అఖిల్ గురించి కూడా??