Aamir Khan: వాగ్దానం మర్చిపోయిన అమీర్ ఖాన్, కష్టాల సుడిగుండంలో చేనేత కుటుంబం

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడంతో ఓ కుటుంబం అష్టకష్టాలు పడుతుంది.

Aamir Khan: వాగ్దానం మర్చిపోయిన అమీర్ ఖాన్, కష్టాల సుడిగుండంలో చేనేత కుటుంబం

Aamir

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట ఇచ్చి.. నిలబెట్టుకోకపోవడంతో ఓ కుటుంబం అష్టకష్టాలు పడుతుంది. కుటుంబ పెద్దను కోల్పోయి, బ్రతుకు భారమై.. కుటుంబాన్ని పోషించుకునేందుకు బీడీలు చుట్టుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది ఆ కుటుంబం. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.. 2009లో తన “3ఇడియట్స్” చిత్రం ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని చందేరిలో పర్యటించాడు. ఆ చిత్ర హీరోయిన్ కరీనా కపూర్ తో కలిసి.. చందేరి సమీపంలోని ప్రాన్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. చేనేతలకు, వస్త్ర కళలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అయితే అప్పట్లో సౌకర్యాలు లేక చేనేతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

Also read: Mobiles in India: రానున్న ఐదేళ్ళలో రూ.25 లక్షల కోట్లకు మొబైల్ తయారీ పరిశ్రమ: కేంద్ర మంత్రి

ఈక్రమంలో 2009లో ప్రాన్పూర్ గ్రామంలోని కమలేష్ కోరి అనే చేనేత కార్మికుడి ఇంటిని ఆకస్మికంగా సందర్శించాడు అమీర్. చేనేతల కష్టాల గురించి, వస్త్రాల గురించి కమలేష్ ద్వారా తెలుసుకున్న అమీర్..నటి కరీనాతో కలిసి ఆ చేనేత ఇంటిలో భోజనం కూడా చేశాడు. అనంతరం కమలేష్ వద్ద రూ.25 వేల విలువైన రెండు చీరలు కొని ఒకటి కరీనాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక చేనేతల కష్టాలు విన్న అమీర్ ఖాన్.. వారి కోసం ముంబై నగరంలో ప్రత్యేకంగా షోరూమ్ ఏర్పాటు చేసి.. నేరుగా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చాడు. భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినా నిస్సంకోచంగా తనను సంప్రదించమంటూ.. తన ఫోన్ నెంబర్ సహా ఒక ఉత్తరాన్ని సైతం కమలేష్ కోరి కుటుంబానికి ఇచ్చాడు అమీర్. అంతే కాదు పోతూపోతూ..ఒక బంగారు ఉంగరాన్ని సైతం కమలేష్ కు బహుమానంగా ఇచ్చాడు అమీర్. అమీర్ రాకతో కమలేష్ స్థానికంగా ఒక సంచలనం అయ్యాడు. ఇక తన కష్టాలు తీరినట్టేనని భావించాడు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు.. ఏళ్ళు గడిచినా కమలేష్ స్థితిగతులు మారలేదు.

Also read: China Pakistan: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో ఇమ్రాన్ ఖాన్ భేటీ

ఇది జరిగి 13 సంవత్సరాలు కావొస్తుంది. కరోనా సోకి ఇటీవల కమలేష్ మృతి చెందాడు. కరోనా సమయంలో ఏడాది పాటు.. వ్యాపారమే జరగకపోవడంతో వారి కుటుంబ పరిస్థితి మరింత దిగజారిందని.. కమలేష్ భార్య కమల భాయి ఆవేదన వ్యక్తం చేసింది. చేనేత పని చేతకాకపోవడంతో.. ఇద్దరు పిల్లలను, కుటుంబాన్ని పోషించేందుకు బీడీలు చుట్టుకుంటున్నామని కమల భాయి చెప్పినట్లు bhaskar.com అనే వెబ్ సైట్ వెల్లడించింది. తన భర్త కమలేష్ బ్రతికున్నపుడు అమీర్ ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ.. అతను ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎన్నడూ పనిచేయలేదని కమల భాయి చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అమీర్ ఖాన్ ఇచ్చిన బంగారపు ఉంగరం తమ వద్దనే ఉన్నా.. ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని మాత్రం ఆయనకు గుర్తుగా ఉంచుకున్నట్లు ఆమె తెలిపింది. అమీర్ ఖాన్ ఆదుకుంటాడని తన భర్త ఎంతో వేచి చూశాడని, కానీ తమ ఆశలు గల్లంతయ్యాయని కమల భాయి ఆవేదన చెందింది.

Also read: Australia Borders: అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించనున్న ఆస్ట్రేలియా