ABP-CVoter Opinion Poll : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..నాలుగింటిలో బీజేపీకే అడ్వాంటేజ్!

వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో(పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మణిపూర్,గోవా)అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్

ABP-CVoter Opinion Poll : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..నాలుగింటిలో బీజేపీకే అడ్వాంటేజ్!

Bjp

ABP-CVoter Opinion Poll : వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో(పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మణిపూర్,గోవా)అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏబీపీ న్యూస్ మరియు సీ ఓటర్ సంస్థ నిర్వహించిన నెలవారీ సర్వేలో…నాలుగు రాష్ట్రాల్లో హోరాహోరీ పోరాటం ఉన్నప్పటికీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నట్లుగా తేలింది.

యూపీలో కమలమే

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా…రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 212 – 224 సీట్ల మధ్య లభించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 40శాతం ఓట్లతో బీజేపీ తిరిగి యూపీలో అధికారంలోకి వచ్చే అవకాశముందని తెలిపింది. ఇక, గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీకి 151 నుంచి 163 స్థానాలు లభించే అవకాశం ఉందని, ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 34 శాతం ఓట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సర్వే తెలిపింది. మరోవైపు,మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీకి కేవలం 13 శాతం ఓట్లుతో 12-24 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇక, ప్రియాంకా గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడటం లేదు. కాంగ్రెస్ కు 7శాతం ఓట్లతో, 2-10 అసెంబ్లీ సీట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఉత్తరాఖండ్ లో హోరా హోరీ అయినా కూడా

ఇక, ఉత్తరాఖండ్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఏబీపీ-సీఓటర్ సర్వేలోతేలింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి 39.8 శాతం ఓట్లతో 33-39 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 35.7శాతం ఓట్లతో 29- 35 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ..బీజేపీకే కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్లుగా ఏబీపీ-సీఓటర్ సర్వేలోతేలింది. ఉత్తరాఖండ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 1-3 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వే తెలిపింది.

గోవాలో మళ్లీ బీజేపీదే

గోవాలో కూడా బీజేపీకే ఎడ్జ్ కనిపిస్తోందని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనుండగా..బీజేపీకి 30శాతం ఓట్లతో 17-21 స్థానాలు గెల్చుకునే అవకాశముందని సర్వే తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ప్రతిపక్ష స్థానానికి చేరే చాన్స్ ఉందని తెలిపింది. ఆప్ కి 5- 9 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 4-8 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులకు 6-10 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది.

కాగా, 2017 గోవా ఎన్నికల్లో 17 సీట్లు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 13 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ..GFP,MGP పార్టీల మద్దుతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

అయితే ఈ సారి GFP కాంగ్రెస్ తో కలిసి కూటమిగా పోటీలోకి దిగుతుండగా,మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి గోవా ఎన్నికల్లో బీజేపీ మాజీ మిత్రపక్షమైన MGPబరిలోకి దిగుతోంది.

మణిపూర్ లో కూడా  కమలమే

ఇక ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ బీజేపీ ముందంజలో ఉన్నట్లుగా సర్వేలో తేలింది. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో.. బీజేపీకి 29-33 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 23-27 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సర్వేలో తేలింది. ఎన్‌పీఎంకు 2-6 సీట్లు.. ఇతరులకు 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

చేయి జారిపోతున్న పంజాబ్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో..ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజర్టీ వచ్చే అవకాశం లేదని తాజాగా విడుదలైన ఏబీపీ-సీవోటర్స్‌ సర్వే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) 38.4 శాతం ఓట్లను సాధిస్తుందని, ఆ తర్వాతి స్థానంలో 34.1శాతం ఓట్లతో కాంగ్రెస్‌ నిలవనుందని సర్వే వివరిస్తోంది. శిరోమణి అకాళీదల్ కు 20.4శాతం,బీజేపీకి 2.6శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వే తెలిపింది. ఇక,సీట్ల విషయానికొస్తే…50-56 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. కాంగ్రెస్ కు 39-45సీట్లు,శిరోమణి అకాళీదల్ కు 17-23 సీట్లు,బీజేపీకి 0-1 సీట్లు వచ్చే అవకాశముందని సర్వే తెలిపింది. కాగా,పంజాబ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 117.

ALSO READ Tornadoes : అమెరికాలోని 6 రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం..80కి పెరిగిన మృతుల సంఖ్య