Birbhum Incident : పార్లమెంట్‌‌లో కన్నీరు పెట్టిన ఎంపీ రూపా గంగూలీ

ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. బెంగాల్ లో జరిగిన ఘటనలు కలిచివేశాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు...

Birbhum Incident : పార్లమెంట్‌‌లో కన్నీరు పెట్టిన ఎంపీ రూపా గంగూలీ

Mp Rupa

BJP MP Roopa Ganguly : కొన్ని ఘటనలు అందరనీ కలిచివేస్తుంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. భావోద్వేగానికి తట్టుకోలేక కొందరు ఏడ్చేస్తారు. తాజాగా.. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ బీర్ భూం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు అందర్నీ దిగ్ర్భాంతికి గురి చేశాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామ్ పుర్ హట్ శివారులోని బోగ్ టూయి గ్రామంలో చెలరేగిన హింసలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్ హత్యతో ప్రత్యర్థుల ఇళ్లకు కొంతమంది దుండగులు నిప్పు పెట్టినట్లు ఆరోపణలున్నాయి.

Read More : Birbhum : బీర్ భూం ఘటనలో సంచలన విషయాలు, సజీవదహనం కంటే ముందు కొట్టారు ?

దీంతో ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. బెంగాల్ లో జరిగిన ఘటనలు కలిచివేశాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజలు జీవించడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. సామూహిక హత్యలు జరుగుతున్నా..హంతకులను ప్రభుత్వం రక్షిస్తోందన్నారు. మనం మనుషులం.. మనసు లేని రాజకీయాలు చేయమని జరిగిన మరణాలను తలచుకుని కన్నీరుపెట్టుకున్నారు. హత్యలు ఎందుకు చేస్తున్నారని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read More : Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

గత సోమవారం బీర్ భూం జిల్లాలోని బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్, తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత భాదు షేక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. అనంతరం బోగ్ టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. సజీవ దహనం కంటే ముందు.. వీరిని తీవ్రంగా కొట్టారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. సుమోటోగా కేసును స్వీకరించింది. దర్యాప్తు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులు విచారణ జరపలేరని.. అందుకే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.