Aadhaar Card : ఇకపై ఆధార్ కార్డులో తండ్రి, భర్త పేరు ఉండదు

ఆధార్ కార్డులో మార్పులు జరుగనున్నాయి. ఇకపై మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే, దానిలో తండ్రి పేరు, భర్త పేరు ఉండదు. అంటే కార్డుదారుని బంధుత్వం దానిలో వెల్లడికాదు.

Aadhaar Card : ఇకపై ఆధార్ కార్డులో తండ్రి, భర్త పేరు ఉండదు

Adhaar

Changes in the Aadhaar card : ఆధార్ కార్డులో మార్పులు జరుగనున్నాయి. ఇకపై మీరు ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే, దానిలో తండ్రి పేరు, భర్త పేరు ఉండదు. అంటే కార్డుదారుని బంధుత్వం దానిలో వెల్లడికాదు. అది గుర్తింపు రూపంలో మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేదా భర్త పేరు దగ్గర కేరాఫ్ అని ఉంటుంది. ఇటీవల ఒక దరఖాస్తుదారు తన చిరునామా మార్పు చేస్తూ, తన కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేశాడు. అయితే దీనిలో తండ్రి పేరు ఉండాల్సిన చోట కేరాఫ్ అని ఉంది.

పొరపాటు జరిగిందని భావించిన అతను ఆధార్ కేంద్రానికి విషయం తెలియజేశారు. అయితే ఇకపై తండ్రి పేరు, భర్త పేరు స్థానంలో కేరాఫ్ అని ఉంటుందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఆధార్ కార్డులో తండ్రి, కొడుకు, కుమార్తెకు బదులుగా ‘కేరాఫ్’ అని ఉంటుందని కామన్ సర్వీస్ సెంటర్ అధీకృత మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ త్యాగి తెలిపారు. దరఖాస్తుదారు కూడా ‘కేరాఫ్’ లో సంబంధాన్ని తెలియజేయకుండా కేవలం పేరు రాస్తే సరిపోతుందని తెలిపారు. ఈ విధంగా ఆధార్ అప్‌డేట్ జరుగుతుందని చెప్పారు.

2018లో సుప్రీంకోర్టు ఆధార్ కార్డుకు సంబంధించి కీలక తీర్పు వెల్లడించింది. ప్రజల గోప్యతకు ఏ విధంగానూ భంగం కలిగించకూడదని సూచించింది. ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీం కీలక తీర్పు వెల్లడించాక పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మొబైల్ నెంబర్‌కు ఆధార్ తప్పని సరి కాదని.. అవసరమైతే ఆ డేటాను వినియోగదారుడు ఉపసంహరించుకునే వెసులు బాటు కల్పించాలని ‘ఉడాయ్’ నిర్ణయించింది. అంతే కాకుండా బ్యాంకు నెంబర్‌కు కూడా ఆధార్ తప్పని సరి కాదని చెప్పింది.

ఆధార్ విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్న ‘ఉడాయ్’ తాజాగా మరో ప్రతిపాదన చేయనుంది. ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే పదాలను తీసేయాలని.. కేవలం కేరాఫ్ అని మాత్రమే ఉంచాలని నిర్ణయించింది. భర్త పేరు, తండ్రి పేరు ఉండటం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తున్నట్లు గుర్తించింది. ఆధార్ కార్డులో ఉండే సన్నాఫ్, డాటరాఫ్, వైఫ్ ఆఫ్ వంటివి ఉండటం వల్ల ఆస్తి తగాదాలు, వారసత్వ తగాదాలతో కోర్టులకు వెళ్లినప్పుడు ఆధార్‌ను చూపిస్తుండటంతో ఆధార్ సంస్థకు చిక్కులు రావడంతో ఉడాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం కేరాఫ్ అని మాత్రమే పేర్కొంటారు. ఇప్పటి వరకు జారీ అయిన ఆధార్‌లో కూడా మార్పులు చేస్తారని…. ఇకపై పాత వాళ్లు కొత్తగా డౌన్‌లోడ్ చేస్తే కేవలం కేరాఫ్ అని మాత్రమే వస్తుందని అధికారులు చెబుతున్నారు.