CM KCR : లక్ష్యం దిశగా వెళ్తున్నాం, ఫలితాలు కనిపిస్తున్నాయి-కేసీఆర్

CM KCR : లక్ష్యం దిశగా వెళ్తున్నాం, ఫలితాలు కనిపిస్తున్నాయి-కేసీఆర్

Cm Kcr

CM KCR : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంతమంది అన్నారని.. కానీ, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్‌శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే పనేనా అని నాడు కొందరు అన్నారని, నేడు సాధించి చూపించామని చెప్పారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. దాన్ని సాధించే దిశగా వెళ్తున్నామన్న కేసీఆర్.. ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. 85వేల ఎకరాలకు నీళ్లిచ్చే ఆర్డీఎస్ భూములు సమైక్య పాలకుల కనుసన్నల్లో ఉండేవన్నారు.

రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వారికి ఏమీ చేతకాదనే వారని అన్నారు. ఎవరేం చేసినా కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేరన్నారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్ శుద్ది ఉంటే వందశాతం ఏదైనా సాధ్యం అవుతుందన్నారు. ఆరేడేళ్లలో వ్యవసాయంలో అద్భుతాయలు జరిగాయని, 92లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్ సీఐకి ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. వలసపోయిన వారు తిరిగి తెలంగాణకు వస్తున్నారని అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. జిల్లాలో కలెక్టరేట్‌ ఏర్పాటవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొత్త కలెక్టరేట్లకు తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి డిజైన్ చేశారని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత మండేపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్, ట్రైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రం, నర్సింగ్‌ కళాశాలను ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

సిరిసిల్లకు చెందిన పవర్‌ లూం కార్మికులతో పాటు నిరుపేదల కోసం మండేపల్లి దగ్గర ప్రభుత్వం 1,320 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను 80 కోట్ల వ్యయంతో నిర్మించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టూ పద్ధతిలో.. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల సదుపాయాలతో నిర్మాణం చేపట్టింది. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేలా ఆట వస్తువులతో ఉద్యనవనాలు, ఓపెన్‌ జిమ్‌లు సైతం ఏర్పాటు చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం 2017లో ప్రారంభం కాగా.. ఏడాది క్రితమే పూర్తయ్యాయి. పారిశుధ్యం, మౌలిక వసతులతోపాటు ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు అందించే పైపులను ఏర్పాటు చేశారు.