IAS Cadre Rules : కేంద్ర, రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనపై వివాదం

ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాల సీఎంలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం కేసీఆర్ లేఖలో తెలిపారు.

IAS Cadre Rules : కేంద్ర, రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనపై వివాదం

Ias

IAS cadre rules amendment : ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్ సవరణ ప్రతిపాదనపై వివాదం ముదురుతోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కేంద్రం తీరును బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సవరణ వద్దంటూ ఇప్పటికే ప్రధానికి తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు లేఖ రాయగా… తాజాగా తెలంగాణ సీఎం కూడా ఆ లిస్ట్‌లో చేరారు. ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్‌ సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటు లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన స‌వ‌ర‌ణ‌లు రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించేలా ఉన్నాయంటూ ఫైర్‌ అయ్యారు. దొంగదారిలో సర్వీస్‌ రూల్స్ మార్చుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. దమ్ముంటే పార్లమెంట్‌ ద్వారా చట్ట సవరణ చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలో ఉన్న స‌మాఖ్య స్ఫూర్తికి ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రతిపాదిత స‌వ‌ర‌ణ‌లు విరుద్ధమని కేసీఆర్ లేఖలో తెలిపారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆలిండియా సర్వీసెస్‌ అధికారులను పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం నియంత్రించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారని లేఖలో పేర్కొన్నారు. ఆలిండియా స‌ర్వీసుల‌లోని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ స్వరూపాన్నే స‌వ‌ర‌ణ‌లు మార్చేస్తాయ‌న్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లోకి కేంద్రం నేరుగా తలదూర్చడమేనని, ఆలిండియా సర్వీసెస్‌ అధికారులను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ఎత్తుగడ అని ఆరోపించారు.

CM Jagan : వైఎస్సార్ ఈబీసీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. 3,92, 674 మంది అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ

అఖిల భారత సర్వీసుల అధికారులు రాష్ట్రాల్లో నిర్వర్తించే క్లిష్టమైన, కీలకమైన విధులను దృష్టిలో ఉంచుకుని… ప్రస్తుత నిబంధనలు వారిని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు పంపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి చేశాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు ఈ అధికారానికి తూట్లు పొడిచేలా ఉన్నాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆ స‌వ‌ర‌ణ‌ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామ‌ని.. వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

మరోవైపు… కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు మధ్య ఇటీవలి కాలంలో అనేక విషయాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల క్యాడర్ రూల్స్‌లో సవరణ చేయాలన్న ప్రతిపాదన.. మరోసారి కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వివాదానికి కారణమైంది. ఈ నెల 12న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ రాష్ట్రాలకు ఈ ప్రతిపాదన చేసిన దగ్గర నుంచి వివాదం మొదలైంది. ఐఏఎస్ ఆఫీసర్ల క్యాడర్‌ను నిర్ణయించే అధికారం రాష్ట్రాల పరిధి నుంచి తొలగించి… కేంద్రం తీసుకుంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్యాడర్‌ రూల్స్‌లో కూడా మార్పులు చేయనున్నట్టు ప్రతిపాదిస్తూ రాష్ట్రాలకు లేఖలు పంపింది. రూల్స్‌లో మార్పులు చేస్తే ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల క్యాడర్ నిర్ణయించే అధికారం కేంద్రం పరిధిలోకి వస్తుంది. రాష్ట్రాల అనుమతితో పనిలేకుండా కేంద్రమంత్రిత్వ శాఖలు క్యాడర్ నిర్ణయించవచ్చు.

AP Government : ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం

అయితే రాష్ట్రాలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది క్రూరమైన పథకంగా బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సవరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. సమాఖ్య నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. తాజాగా కేరళ, తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరాయి. కేంద్రం ప్రతిపాదన రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ ఆరోపించారు.

అయితే రాష్ట్రాల ఆరోపణలను కేంద్ర ఖండిస్తోంది. ఐఏఎస్‌ల మార్పు కేంద్రం-రాష్ట్రాల సమస్యల కాదు… దేశ పాలనకు సంబంధించినదని స్పష్టం చేసింది. ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్ సవరణ ప్రతిపాదన అంశాన్ని కేంద్రం-రాష్ట్రాల మధ్య వివాదం కోణంలో చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రాలుగా దేశంలోని పాలనను సజావుగా సాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం ప్రతిపాదించిన సవరణలను సవాల్ చేయడం మంచికాదంది. మెరుగైన పాలన విధానాలను రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో అమలు అనుభవాన్ని కేంద్రస్థాయిలోని ఐఏఎస్‌ అధికారులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు సరిపడా అధికారులను అందించడం లేదని కేంద్రం ప్రధానంగా ఆరోపిస్తోంది. అధికారుల కొరత పాలనపై ప్రభావం చూపుతుందని.. అందుకే ఈ సవరణ ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చామని చెప్తోంది.