కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల తరలింపు..దేశంలోని 60 కన్‌సైన్‌ కేంద్రాలకు టీకా

కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల తరలింపు..దేశంలోని 60 కన్‌సైన్‌ కేంద్రాలకు టీకా

covishield‌ vaccine evacuation start from a serum company : పుణెలోని సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్‌ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ తరలింపును చేపట్టారు. రవాణా కోసం జీపీఎస్‌ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగిస్తున్నారు అధికారులు. 300 ట్రక్కుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంస్థ నుంచి బయలుదేరింది. దేశవ్యాప్తంగా ఉన్న 60 కన్‌సైనీ కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. సంస్థ నుంచి ట్రక్కులు బయటకు వచ్చే ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు సీరం సంస్థ అధికారులు.

భారత్‌ బయోటెక్‌ తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ ఇవాళ ప్రారంభమవగా.., మరో రెండు రోజుల్లో అది ముగుస్తుంది. సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కొవాగ్జిన్‌ టీకాలకు ఆర్డర్లిచ్చింది కేంద్రం. సీరం నుంచి కోటీ పది లక్షల డోసులను, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల డోసులను కొనుగోలు చేసింది. దీనికి అదనంగా.. ఏప్రిల్‌లోగా నాలుగున్నర కోట్ల కొవిషీల్డ్‌ డోసులను కొనుగోలు చేయనుంది కేంద్రం.

3 కోట్ల మంది కరోనా వారియర్స్‌ కోసం ఈ ఆరు కోట్లకుపైగా డోసులను కొంటుంది కేంద్రం. వీటి మొత్తం విలువ పదమూడు వందల కోట్ల రూపాయల మేర ఉంటుంది. సీరం సంస్థ నుంచి ఒక్కో డోసు కొవిషీల్డ్‌కు 200 రూపాయలు కాగా, 10 రూపాయల మేర జీఎస్‌టీ దీనికి అదనమని అధికారులు తెలిపారు. ఇందుకు 231 కోట్ల రూపాయలు కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది. కొవాగ్జిన్‌కు ఒక్కో డోసుకు 295 రూపాయలను చెల్లించనుంది. 55 లక్షల డోసులకు గానూ దీనికి 162 కోట్ల రూపాయల ఖర్చవుతుంది.

స్వచ్ఛందంగా కరోనా టీకా స్వీకరించేందుకు ముందుకు రావాలని ఐఎంఏ తమ సభ్యులకు పిలుపునిచ్చింది. ఇవి సురక్షితమైనవి, సమర్థవంతమైనవని ప్రపంచానికి చాటి చెప్పేందుకు 3.5 లక్షల మంది సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్లు తీసుకోవాలని కోరింది. శాస్త్రీయ సమాచారాన్ని, వ్యాసాలను, నిపుణుల నివేదికలను సమీక్షించడంతో పాటు భారతీయ వైద్య పరిశోధన మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థల నిపుణులతో చర్చించిన మీదట కరోనా టీకా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపింది.

టీకాలు తీసుకోవడం వల్ల వ్యక్తిగత రక్షణతో పాటు సామూహిక రోగనిరోధక శక్తి లభిస్తుందని, తద్వారా కరోనాకు కళ్లెం పడుతుందని తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత కూడా భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది. టీకా తీసుకున్నవారిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పర్యవేక్షించడానికి ఐఎంఏ ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో దిల్లీలో ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది.

కరోనా వ్యాక్సిన్‌ తొలి దశలో ఆరోగ్య సిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇస్తామని, ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని మోదీ తెలిపారు. టీకా తీసుకునే 3 కోట్ల మందిలో ప్రజా ప్రతినిధులు ఉండరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రెండో దశలో 50ఏళ్ల పైబడినవారు.. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు స్వదేశీ టీకాలకు అనుమతి, త్వరలో మరో నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌పై రియల్‌ టైం డేటా అవసరమని, టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ సర్టిఫికేట్‌ను జనరేట్‌ చేయాలని.. డిజిటల్‌ సర్టిఫికేట్‌తో రెండో డోసు ఇవ్వడం సులభమవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

ఇటు.. వ్యాక్సిన్‌ డోసులు వస్తుండటంతో.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీల్లో భ‌ద్రప‌రిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశాయి. తెలంగాణలో కోఠిలోని కోల్డ్ స్టోరేజీతో పాటు రాష్ట్రంలో మొత్తం 866 కోల్డ్ స్టోరేజీల‌ను సిద్ధం చేసింది. తెలంగాణకి మొత్తం 6 లక్షల 50 వేల వాక్సిన్ డోసులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి వాక్సిన్ ఇచ్చేందుకు 139 సెంటర్లను ఏర్పాటు చేయగా.. తొలి దశలో మొత్తం వ్యాక్సిన్ లబ్ధిదారులు 2 లక్షల 98వేల 424మంది ఉన్నారు.