ISRO launch Aditya L1 : సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో..ఆదిత్యయాన్‌తో రహస్యం వీడుతుందా?

సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడు గురించి ఎన్నో ఏళ్లుగా.. మిస్టరీగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నలన్నింటికి.. సమాధానాలు వెతికేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. భానుడిపై రీసెర్చ్‌ కోసం.. తొలి శాటిలైట్‌ని ప్రయోగించేందుకు మన శాస్త్రవేత్తలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదిత్య-ఎల్1 పేరుతో.. ఇస్రో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. 2023 మొదట్లోనే ఈ ప్రయోగం జరపనున్నారు. ఈ ఆదిత్యయాన్‌తో.. సూర్యుడి సీక్రెట్ బయటపడుతుందా?

ISRO launch Aditya L1 : సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో..ఆదిత్యయాన్‌తో రహస్యం వీడుతుందా?

ISRO launch Chandrayaan-3 and  Aditya L1

ISRO launch Chandrayaan-3 and  Aditya L1 : సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడు.. అనేక అంతుచిక్కని ప్రశ్నలతో మానవాళి మెదళ్లను తొలిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా.. మిస్టరీగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నలన్నింటికి.. సమాధానాలు వెతికేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. భానుడిపై రీసెర్చ్‌ కోసం.. తొలి శాటిలైట్‌ని ప్రయోగించేందుకు మన శాస్త్రవేత్తలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదిత్య-ఎల్1 పేరుతో.. ఇస్రో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. 2023 మొదట్లోనే ఈ ప్రయోగం జరపనున్నారు. ఈ ఆదిత్యయాన్‌తో.. సూర్యుడి సీక్రెట్ బయటపడుతుందా?

ఇప్పటికే.. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌-1, చంద్రయాన్‌-2, అంగారకుడిపై రీసెర్చ్‌కు.. మంగళ్‌యాన్‌-1 అనే మూడు ప్రయోగాలను.. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా పూర్తి చేసి.. ఇస్రో సైంటిస్టులు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు.. ఏకంగా సూర్యుడిపై నెలకొన్న వాతావరణం గుట్టుని విప్పేందుకు.. ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. సౌర వాతావరణంతో పాటు సూర్యుని కరోనాను అధ్యయనం చేసేందుకు.. ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇది. ఇందుకోసం.. సంస్కృతంలో సూర్యుని పేరైన.. ఆదిత్య అనే పేరును సెలక్ట్ చేశారు. ఇక.. ఎల్1 అంటే లాగ్‌రేంజ్ పాయింట్ అని అర్థం. ఈ శాటిలైట్‌ని ప్రవేశపెట్టబోయేది.. సూర్యుని ఎల్1లోనే. అందుకే.. ఈ మిషన్‌ని.. ఆదిత్య-ఎల్1 అని పిలుస్తున్నారు. ఇది.. ఐదేళ్లు పనిచేసే విధంగా రూపొందించారు. ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం 378 కోట్లకు పైగా కేటాయించింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. చాలా నెలలుగా సూర్యుడిపై రీసెర్చ్ చేస్తోంది. 2018లోనే.. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. 2020లోనే ఈ ప్రయోగం పూర్తి చేయాల్సి ఉంది. కానీ.. కోవిడ్‌ వల్ల ఆలస్యమైంది. మళ్లీ.. ఇన్నాళ్లకు ఈ ప్రయోగం తెరమీదకొచ్చింది. భారత ప్రభుత్వం నుంచి కూడా దీనికి పర్మిషన్ వచ్చేసింది. దీంతో.. 2023 జనవరి చివరి నాటికి.. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు.. ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1‌ని.. విజయవంతంగా ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలంతా.. సన్నాహాలు చేస్తున్నారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సైతం.. ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్ క్లిష్టమైన పేలోడ్ టెస్ట్‌ దశలో ఉందని.. ఇటీవలే తెలిపారు. పూర్తి స్పేస్ క్రాఫ్ట్‌ను అసెంబుల్ చేసి.. టెస్ట్ చేయాల్సి ఉందన్నారు. 2023 ప్రారంభంలోనే.. ఆదిత్య ఎల్1ని ప్రయోగించేందుకు ఇస్రో షెడ్యూల్ ఫిక్స్ చేసింది.

Also read : ISRO : సూర్యుడు రహస్యాలను కనుగొనటానికి ఆదిత్య ఎల్1తో పాటు ఇస్రో లిస్టులో.. ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు

దేశంలోని వివిధ ఆస్ట్రోఫిజిక్స్ ఇనిస్టిట్యూట్స్‌తో సంప్రదింపులు జరిపి.. ఆదిత్య ఎల్1లో ఉండే పేలోడ్స్‌ని రూపొందించింది ఇస్రో. ఈ శాటిలైట్‌ని.. బెంగళూరులోని యు.ఆర్‌.రావు స్పేస్‌ సెంటర్‌లో తయారుచేస్తున్నారు. దీని బరువు.. 1500 కిలోలు ఉంటుంది. ఇందులో.. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్‌తో సహా మొత్తం ఏడు పేలోడ్‌లను మోసుకెళుతుంది. పేలోడ్స్ బరువు 244 కిలోలు కాగా.. ద్రవ ఇంధనం బరువు 1230 కిలోలకు పైనే ఉంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం.. ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహాన్ని.. సూర్యుని ఎల్1 కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికంటే ముందు.. ఎలిప్టికల్ ఎర్త్ పార్కింగ్ కక్ష్యలో ఉంచుతారు. ఆదిత్య ఎల్1ని.. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్‌రేంజ్ బిందువు ఎల్1‌లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని.. సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. గ్రహణాల సమయంలోనూ ఆ ప్రాంతంలో సూర్యుడిని స్పష్టంగా చూడొచ్చు… అందుకే ఆ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకుంది ఇస్రో.

సూర్యుని వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలో­మీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటుంది. సూర్యుని అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరగటానికి గల కారణం అంతుచిక్కడం లేదు. దీని మీదే.. ఆదిత్య ఎల్1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే.. సౌర తుపాన్‌ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా.. ఫొటో స్పియర్, క్రోమో స్పియర్‌లపైనా రీసెర్చ్ చేసి సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.

సూర్యుడిపై విస్తృత అధ్యయనాల కోసం అమెరికాకు చెందిన నాసా ఇప్పటికే.. పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించింది. తాజాగా.. ఆదిత్య ఎల్1తో.. ఇస్రో కూడా ఈ తరహా ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతుండటం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎల్‌ 1 చుట్టూ.. హాలో కక్ష్యలో అయస్కాంత క్షేత్ర బలంలో సంభవించే మార్పులను సైతం.. ఆదిత్య ఎల్1 రికార్డు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుని కరోనాను గమనించడమే.. ఆదిత్య ఎల్1 మిషన్ ప్రధాన లక్ష్యం. సూర్యునిలో జరుగుతున్న డైనమిక్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.