Mahua Moitra: మహిళా ఎంపీ అభ్యంతకర వ్యాఖ్యలు.. పార్లమెంట్ లో వాడకూడని పదాలు ఇవే..

Mahua Moitra Offensive Language: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది.

Mahua Moitra: మహిళా ఎంపీ అభ్యంతకర వ్యాఖ్యలు.. పార్లమెంట్ లో వాడకూడని పదాలు ఇవే..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను అధికార బీజేపీ టార్గెట్ చేసింది. మహువా క్షమాపణ చెప్పాలని కమలనాథులు డిమాండ్ చేయగా, ఆమె తిరస్కరించారు. వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లోనూ అభ్యంతరకర పదాలు దొర్లడంతో వాటిని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.

చట్టసభల్లో విధాన నిర్ణేతలు అభ్యంతకర పదాలు వినియోగించడం ఇదే మొదటిసారి కాదు. పార్లమెంటులో ఎంపీలు ఎలాంటి పదాలు వాడాలి, ఎలాంటి మాటలు మాట్లడకూడదు అనే విషయం మీకు తెలుసా? 62 కొత్త అన్‌పార్లమెంటరీ పదాలను చేర్చి గతేడాది జూలైలో విడుదల చేసిన జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాడుకలో ఎక్కువగా ఉపయోగించే పదాలను కూడా అభ్యంతకరమైనవిగా పేర్కొనడం పట్ల విమర్శలు వచ్చాయి.

Also Read: సొంత పార్టీని మరింత ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు

వాడకూడని పదాలు ఇవే..
ఈ జాబితాలో జుమ్లజీవి (jumlajeevi), బాల్ బుద్ధి(baal buddhi), కోవిడ్ వ్యాప్తి(Covid spreader), స్నూప్‌గేట్(Snoopgate) ఉన్నాయి. సాధారణంగా ఉపయోగించే సిగ్గు(ashamed), దూషణ(abused), ద్రోహం(betrayed), అవినీతి(corrupt), నాటకం(drama), వంచన(hypocrisy), అసమర్థుడు(incompetent), హత్య(murder), లైంగిక దాడి(sexual assault), అవినీతి(corrupt), నిర్లక్ష్యం(negligence).. తదితరాలను అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో చేర్చారు. చర్చల సమయంలో పార్లమెంట్ లో సభ్యులు ఈ పదాలు ఉపయోగించినట్లయితే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.


పార్లమెంట్ నిర్వహణలో భాగంగానే అన్‌పార్లమెంటరీ పదాల జాబితాను అప్ డేట్ చేయడం జరిగిందని, ఇందులో ఎటువంటి వివాదానికి తావులేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్‌సభ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే పోర్టల్‌లో ఈ జాబితాను 2010 నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పోస్ట్ చేయడం జరుగుతోందని వెల్లడించారు. ‘ఏ పదాన్ని నిషేధించలేదు. కానీ ప్రతి ఒక్కరూ పార్లమెంట్ హుందాతనాన్ని కాపాడితే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సభాపతి నిర్ణయం ఆధారంగానే అన్‌పార్లమెంటరీ పదాలను రికార్డుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండద’ని ఓం బిర్లా స్పష్టం చేశారు.


ఎంపీలు అభ్యంతకర పదాలు వాడితే..

ఎవరైనా సభ్యులు ఈ పదాలను వాడినా ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోరు.
చట్టసభల్లో వినియోగించే అభ్యంతకర పదాలకు చట్టపరమైన గుర్తింపు ఉండదు.
అభ్యంతరకర పదాలు, పరువు నష్టం కలిగించే వ్యక్తీకరణలను తొలగించే అధికారం స్పీకర్‌కు ఉంది.
అభ్యంతకర పదాలు వాడకూడదన్న నిర్బంధం లేదు. కానీ సభ్యులు సంయమనం పాటించాల్సి ఉంటుంది.
పరుష పదజాలం వాడడం కంటే హుందాగా వ్యక్తీకరణ ఉండాలి.